కలం, ఖమ్మం బ్యూరో: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలం (Bhadrachalam) లోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Minister Bandi Sanjay Kumar) బుధవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన మంత్రి సంజయ్ దంపతులకు దేవస్థానం అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం దేవస్థానం వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందజేయగా, దేవస్థానం ఈవో కే దామోదర్ రావు స్వామివారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు, జ్ఞాపికను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. భక్తులు కోరిన కోరికలు తీర్చే భద్రాద్రి రామయ్యను కుటుంబ సమేతంగా దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు అంతా మంచి జరగాలని స్వామివారిని వేడుకున్నట్లు వెల్లడించారు.

