కలం, ఖమ్మం బ్యూరో: రాత్రి వేళల్లో జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పోలీసుల నిఘాను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ (SP Rohith Raj) మంగళవారం అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా చుంచుపల్లి పోలీస్ స్టేషన్‌తో పాటు జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్‌ను ఆయన స్వయంగా సందర్శించి, రాత్రి గస్తీ ఏర్పాట్లను, సిబ్బంది పనితీరును సమగ్రంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా కంట్రోల్ రూమ్‌లో సీసీ కెమెరాల పర్యవేక్షణ తీరును పరిశీలించిన ఎస్పీ, నగర పరిధిలో అనుమానాస్పద కదలికలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ సంబంధిత అధికారులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. అలర్టింగ్ ఆఫీసర్లు, రౌండింగ్ అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందితో నిరంతరం సమన్వయం పాటిస్తూ రాత్రి నిఘాను కట్టుదిట్టం చేయాలన్నారు. రాత్రి సమయాల్లో పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాలతో విస్తృతంగా గస్తీ నిర్వహిస్తూ ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, ముఖ్యంగా ప్రధాన రహదారులు, జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతాల్లో ‘విజిబుల్ పోలీసింగ్’ పెంచాలని స్పష్టం చేశారు.
అలాగే జిల్లా వ్యాప్తంగా సస్పెక్ట్ షీట్లు, రౌడీ షీటర్ల కదలికలు, కార్యకలాపాలపై నిరంతరం సమీక్ష నిర్వహించాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. అత్యవసర సమయాల్లో డయల్-112 కి ఫోన్ వచ్చిన వెంటనే స్పందించి, తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు వేగవంతమైన సహాయం అందించాలని ఎస్పీ రోహిత్ రాజ్ పిలుపునిచ్చారు.

