కలం, వెబ్ డెస్క్ : వినాయక చవితి వేడుకలకు సిద్ధమవుతున్న వేళ ఏపీలోని కూటమి ప్రభుత్వం ఉత్సవ కమిటీలకు, భక్తులకు అదిరిపోయే తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే గణేశ్ మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కీలక ప్రకటన చేశారు. ప్రజల పండుగకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్న మంత్రి నారా లోకేష్.. ఈ నిర్ణయంతో ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా మరింత వైభవంగా, ఘనంగా నిర్వహించుకునేందుకు మార్గం సుగమమైందని తెలిపారు.
ఈ సందర్భంగా విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. గణేశ్ ఉత్సవాలను ప్రజలు ఆనందంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ ఉత్సవ నిర్వాహకులు, భక్తుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

