కలం, జోగులాంబ గద్వాల: గణపతి నిమజ్జనం(Ganapati Immersion) అంటే వెలుగులు జిగేల్‌మంటాయి.. డీజే సౌండ్‌లతో దద్దరిల్లుతాయి.. బ్యాండ్ బాజాలు కాలు కదిపేలా చేస్తాయి.. రంగురంగుల పేపర్లు గాల్లో నుంచి ఎగిరిపడుతుంటాయి.. ఉత్సాహంతో యువత కేరింతలు ఆకట్టుకుంటాయి.. గణపతి బప్పా మోరియా.. అంటూ నినాదాలతో భక్తిభావం వెల్లివిరిస్తుంది.. కానీ, ఇదంతా ఇప్పుడు గణపతి స్వాగతోత్సవాల్లోనూ కనిపిస్తున్నది. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రమైన గద్వాల (Gadwal) లో వినాయక చవితి ఉత్సవాల సందళ్లు అంబరాన్నంటాయి.
నిమజ్జనాన్ని తలపిస్తున్న ఆగమన వేడుకలు
బొజ్జ గణపయ్య ఆగమన వేడుకలు (Celebrations Welcoming Lord Ganesha)(గణేష్ ఆగమనం) గద్వాల పట్టణంలో ఉత్సాహపూరిత వాతావరణంలో సాగుతున్నాయి. వివిధ యూత్ అసోసియేషన్లు, ఉత్సవ సమితుల ఆధ్వర్యంలో వినాయక విగ్రహాలను మండపాలకు తరలించే క్రమంలో నిర్వహించిన ఊరేగింపులు అట్టహాసంగా సాగుతున్నాయి.
డీజే శబ్దాలు, బ్యాండ్ బాజాలతో వెల్‌కమ్
పట్టణంలోని వీధుల గుండా సాగిన ఈ ప్రదర్శనలు ఒకదానికొకటి పోటాపోటీగా సాగాయి. డీజే మోతలు, డప్పు చప్పుళ్లు, తీన్‌మార్ డాన్సులు, కలర్‌ఫుల్ బాణసంచా కాల్పుల నడుమ యువత ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ విగ్రహాలను ఊరేగించారు. కళాకారుల ప్రదర్శనలు, భక్తుల కోలాహలంతో గద్వాల పురవీధులన్నీ ఆధ్యాత్మిక శోభతో నిండిపోయాయి. గణేశ్ ఆగమనంతో పట్టణ ప్రజల్లో పండుగకు ముందే పండుగ వాతావరణం నెలకొంది. ఖర్చు ఎక్కువైనా పర్లేదు.. కానీ తగ్గేదేలే అంటున్నారు. రెట్టించిన ఉత్సాహంతో గణపతులకు వెల్‌కమ్ చెబుతున్నారు.

