కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీలో (Telangana Assembly) తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలను (BRS MLAs)అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తూ శాసనసభ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. శాసనసభ నుంచి బీఆర్ఎస్ సభ్యులను సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. దీంతో ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించేందుకు అవకాశం లేకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు.
సస్పెన్షన్‌కు మంత్రి శ్రీధర్‌బాబు తీర్మానం
అంతకుముందు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని మంత్రి శ్రీధర్‌బాబు శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం స్పీకర్ ఆ తీర్మానాన్ని సభలో ఆమోదింపజేసి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ నిర్ణయంతో సభలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించే విధంగా వ్యవహరించారనే కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారపక్షం పేర్కొంటున్నప్పటికీ.. బీఆర్‌ఎస్ మాత్రం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమ ఎమ్మెల్యేలపై తీసుకున్న చర్య ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు.
ప్రజా సమస్యలపై చర్చకు భయపడుతున్నారా?
ప్రజలకు సంబంధించిన కీలక అంశాలు, ముఖ్యంగా 22A వంటి సమస్యలు శాసనసభలో చర్చకు రాకుండా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తోందని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. ప్రజా సమస్యలను లేవనెత్తుతున్న తమ ఎమ్మెల్యేల గొంతు నొక్కేందుకే సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నారని విమర్శించింది. మరోవైపు, సభా నియమాలు, క్రమశిక్షణను పాటించడం తప్పనిసరని అధికారపక్షం స్పష్టం చేస్తోంది. తాజా సస్పెన్షన్ నిర్ణయంతో ఈ అసెంబ్లీ సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ విభేదాలు మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.

