కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ తొలి రోజున గేట్ నంబర్ 3 వద్ద జరిగిన ఘటనలో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు (KTR – Harish Rao), నవీన్ రెడ్డి, సుధీర్ రెడ్డి సహా మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సైఫాబాద్ పీఎస్ లో కేసు నమోదైంది. మహిళా కానిస్టేబుల్ పద్మావతి ఇచ్చిన ఫిర్యాదుతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మహిళా పోలీసులకు విధులకు ఆటంకం కలిగించి దుర్భాషలాడి, బెదిరించారని, మహిళా పోలీసులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాదు టీషర్టులు విప్పి మహిళా పోలీసుల ఎదుట అర్ధనగ్నంగా నిలబడ్డారని, బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీంతో కేటీఆర్, హరీశ్ రావుతో సహా పలువురు నేతలపై కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి చర్యలకు దిగారు. అసెంబ్లీ గేట్ నంబర్ 3 వద్ద జరిగిన వీడియోలు, ఫోటోలు, వైద్య రికార్డులను పోలీసులు పరిశీలించనున్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అనైతికంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ కేసు పెట్టించిందని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు.

