14 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి.. ఈ నెల 12న నాగర్‌కర్నూల్‌లో మహాధర్నా

కలం, నాగర్ కర్నూల్: పాలమూరు (Palamuru) ప్రాంతానికి కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా దక్కేలా చర్యలు తీసుకోవడంతో పాటు పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఉమ్మడి మహబూబ్‌నగర్‌ (Mahabubnagar) జిల్లా పెండింగ్‌ ప్రాజెక్టుల సాధన జేఏసీ డిమాండ్‌ చేసింది. డిండి ప్రాజెక్టు (Dindi Project) ద్వారా నల్గొండ వైపు నీటిని తరలించే చర్యలను నిలిపివేయాలని కోరింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తే వచ్చే ఎన్నికల్లో 14 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తామని జేఏసీ నేతలు పేర్కొన్నారు.

ఈ నెల 12న నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో మహాధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పాలమూరు పేరు చెప్పుకుని ఎన్నో ఉద్యమాలు, రాజకీయాలు జరిగాయని, తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ ఈ ప్రాంతం కీలక పాత్ర పోషించిందని నేతలు గుర్తుచేశారు. అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా పాలమూరు ప్రాంతానికి ఆశించిన స్థాయిలో సాగునీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జలాల వినియోగం విషయంలో పాలమూరు ప్రాంతానికి అన్యాయం జరుగుతోందని వారు ఆరోపించారు.

పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేయాలని డిమాండ్‌

జేఏసీ నాయకుడు రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ ..కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి తదితర ప్రాజెక్టుల పనులను పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలని డిమాండ్‌ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల పనులు పూర్తయ్యాయని చెప్పినా, క్షేత్రస్థాయిలో ఇంకా అనేక ప్రాంతాలకు నీరు చేరడం లేదని విమర్శించారు. లక్ష్మీదేవిపల్లి వరకు నీటిని తరలించేలా అవసరమైన పనులు చేపట్టాలని కోరారు. పాలమూరు జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టులపై స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని నిలదీయాలని అన్నారు. నల్గొండ ప్రాంతంలో పలు ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తున్నారని, అదే స్థాయిలో పాలమూరు ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆరోపించారు.

డిండి నీటి తరలింపుపై అభ్యంతరం

జేఏసీ నాయకుడు రాఘవాచారి మాట్లాడుతూ.. పాలమూరు-రంగారెడ్డి పథకం డిజైన్‌, లిఫ్టుల సామర్థ్యం, నీటి తరలింపు విధానంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రాజెక్టుల ద్వారా ఏ ప్రాంతాలకు ఎంత నీరు అందుతుంది అనే అంశాన్ని ప్రజలకు వివరించాలని కోరారు. కృష్ణా జలాలను డిండి వైపు తరలించే ప్రతిపాదనలను తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఎస్‌ఎల్‌బీసీ, దుందుభి నీటి మళ్లింపుపైనా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కృష్ణా జలాల్లో పాలమూరు ప్రాంతానికి దక్కాల్సిన వాటాను పూర్తిగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

12న నాగర్‌కర్నూల్‌లో మహాధర్నా

తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు శ్యామ్‌ మాట్లాడుతూ ..నీటి సమస్య పరిష్కారం కోసం రాజకీయాలకు అతీతంగా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ నెల 12న నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించే మహాధర్నా, సామూహిక దీక్షకు ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు హాజరై మద్దతు ఇవ్వాలని కోరారు.

జేఏసీ కో-చైర్మన్‌ తిమ్మప్ప మాట్లాడుతూ ..పాలమూరు ప్రాంతంలో కృష్ణా నది ప్రవహిస్తున్నప్పటికీ సాగునీటి కొరత కొనసాగడం దురదృష్టకరమన్నారు. డిండి ప్రాజెక్టును రద్దు చేసి, పాలమూరు-రంగారెడ్డి పథకం ద్వారా నిర్దేశిత ఆయకట్టుకు నీరు అందించాలని డిమాండ్‌ చేశారు. జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి డిండి నీటి తరలింపును నిలిపివేయాలని కోరారు. నీటి హక్కుల కోసం ఉద్యమాన్ని మరింత విస్తృతం చేస్తామని జేఏసీ నేతలు స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>