కలం, ఆదిలాబాద్: విమానాశ్రయం (Airport) నిర్మాణ ప్రక్రియలో భాగంగా చేపట్టాల్సిన భూసేకరణ (Land Acquisition) ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Collector Rajarshi Shah) అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో విమానాశ్రయం నిర్మాణంపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎయిర్‌పోర్ట్ నిర్మాణం, విస్తరణలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులు, గ్రామస్థులకు సంబంధించిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా రైతులు, గ్రామస్థులతో చర్చలు జరిపి భూసేకరణ రేట్లను ఖరారు చేసి తదుపరి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
ఆయా సర్వే నంబర్లకు సంబంధించిన పెండింగ్ దస్తావేజులను త్వరితగతిన పరిష్కరించాలని, అవసరమైన అదనపు ఎక్సెంప్షన్ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణ ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా రెవెన్యూ, సర్వే, ఇతర సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేసేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఆర్.ఎస్. చిత్రూ, ఎస్. రాజేశ్వర్, డిప్యూటీ కలెక్టర్ వంశీకృష్ణ, ఆర్డీవో జగదీశ్వర్ రావు, భూ సర్వే కొలతల శాఖ ఏడీ ప్రభాకర్‌తో పాటు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

