కలం, వెబ్ డెస్క్: విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లోని నిర్మాణంలో ఉన్న సమీకృత టెర్మినల్ పనులపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) దృష్టి సారించారు. ఈ మేరకు టెర్మినల్ నిర్మాణ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పూర్తయిన పనులు, కొనసాగుతున్న నిర్మాణ పనులతోపాటు, ఎదురవుతున్న సమస్యలు, అధికారుల చర్యలపై ఆరా తీశారు. పనులకు సంబంధించి సమగ్ర వివరాలను అధికారులు మంత్రికి వివరించారు.
విమానాశ్రయ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించేలా అత్యాధునిక వసతులతో టెర్మినల్‌ను తీర్చిదిద్దుతున్నట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. టెర్మినల్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు సమస్యలను అధిగమిస్తూ ముందుకెళ్తున్నామని వివరించారు. విజయవాడ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా టెర్మినల్ నిర్మాణం ఉండబోతుందన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ పనులను పూర్తి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. విజయవాడ ఎయిర్ పోర్ట్ అభివృద్ధిలో సమీకృత టెర్మినల్ నిర్మాణం ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది.

