కలం, వెబ్ డెస్క్: కేసీఆర్ చనిపోవాలంటూ కోరుకుంటున్నానని కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) ఫైర్ అయ్యారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్టేషన్‌కు వెళ్లిన ప్రవీణ్ కుమార్ ఎస్‌హెచ్‌వోను కలిసి మూడు పేజీల ఫిర్యాదు లేఖ అందించారు.
అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ సాధించిన వ్యక్తిగా, మాజీ సీఎంగా పనిచేసిన కేసీఆర్‌పై అధికార పార్టీ ఎమ్మెల్యే ఈ రకంగా మాట్లాడటం దారుణమన్నారు. ఈ వ్యాఖ్యల వెనుక కచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని.. ఆయనే శంకర్‌తో ఇలా మాట్లాడించి ఉంటారన్నారు. వెంటనే తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్‌కు భద్రత పెంచాలి..
కేసీఆర్‌పై అధికార పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో కేసీఆర్ భద్రతకు ప్రమాదం పొంచి ఉందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే సెక్యూరిటీ రివ్యూ చేసి భద్రతను మరింత పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే శంకర్ వ్యాఖ్యలు కేసీఆర్ వ్యక్తిగత భద్రతకే కాకుండా సమాజంలో అశాంతి రగిల్చేలా ఉన్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

