కలం, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ (Telangana Assembly) వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు ఉన్న బ్లాక్ టీషర్టులను ధరించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రావడంతో వివాదం మొదలైంది. వాళ్లను అసెంబ్లీ మెయిన్ ఎంట్రీ గేటు దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. ఇలా వెళ్లడానికి స్పీకర్ అనుమతి లేదని, ఆయన ఆదేశాలతోనే అడ్డుకుంటున్నామని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు డీసీపీ శిల్పవల్లి సహా పోలీసు అధికారులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. నినాదాలు రాసి ఉన్న బ్లాక్ టీషర్టులతోనే వివాదమా? అంటూ తన ఒంటి మీద ఉన్న టీషర్టును హరీశ్‌రావు తొలగించారు.
ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తదితరులు కూడా టీషర్టులు విప్పేశారు. ‘ఇప్పుడు సభలోకి వెళ్లవచ్చా?’ అంటూ పోలీసుల మీదికి దూసుకెళ్లారు. గౌరవ సభలోకి బనీను మీద వెళ్లడాన్ని అనుమతించబోమని డీసీపీ శిల్పవల్లి స్పష్టం చేశారు. అడ్డుకుంటున్న పోలీసులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. పోలీసు అధికారులకు కేటీఆర్, కౌశిక్‌రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇవ్వడంతో పాటు విధి నిర్వహణలో ఉన్న వారిని తోసేశారు. ఈ టైమ్‌లోనే స్పీకర్‌పై ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేశారు.
‘22ఏ’పై బీజేపీ ఆందోళన
అసెంబ్లీ (Telangana Assembly) తొలి రోజు బీజేపీ ఎమ్మెల్యేలు సభలో గందరగోళం సృష్టించారు. రాష్ట్రంలో భూభారతి పోర్టల్ వచ్చిన తర్వాత నిషేధిత జాబితా (22-ఏ)లో వేలాది ప్రైవేట్ భూముల సర్వే నెంబర్లను పెట్టి ప్రజలను ఇబ్బందులు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ సభ లోపల ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రశ్నోత్తరాల సమయం జరగకుండా ఆటంకాలు సృష్టించారు. శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు జోక్యం చేసుకుని.. ఈ అంశంపై ప్రభుత్వమే చర్చను ప్రారంభిస్తుందని క్లారిటీ ఇచ్చారు.
సీఎం రేవంత్‌రెడ్డి సైతం చర్చల తర్వాతే నిర్ణయాలు ఉంటాయని, నిర్ణయాల తర్వాత చర్చలు ఉండవని, బీజేపీ ఎమ్మెల్యేలు కోరుతున్నట్లుగా 22-ఏ అంశంపై చర్చ జరుపుతామని హామీ ఇచ్చారు. కాగా, సభకు రావడానికి ముందు గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద బీజేపీ ఎమ్మెల్యేలు నివాళులర్పించారు. నిషేధిత జాబితాలో ప్రైవేట్ భూములను చేర్చి వసూళ్ల పర్వానికి ప్రభుత్వం తెరలేపిందని బీజేపీ ఎల్పీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
సర్కార్‌కు ముందే సంకేతాలు
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు వాడీవేడిగా జరుగుతాయని.. ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా బీఆర్ఎస్, బీజేపీ ప్లాన్ చేస్తున్నాయని కాంగ్రెస్ గ్రహించింది. ముందుగానే అప్రమత్తమై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ ఎంట్రీ దగ్గరే ఆపేసింది. ‘ఎక్కడా తగ్గొద్దంటూ’ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో జరిగిన బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో కేసీఆర్ సంకేతాలు ఇచ్చినట్లు ఆ పార్టీ ఎమ్మెల్యేలే వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాలను లైట్ తీసుకోవద్దని, హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పినట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వం ఊహించినట్లుగానే అసెంబ్లీ సెషన్ మొదటి రోజునే గందరగోళం చోటుచేసుకున్నది. చివరకు బీఏసీ (బిజినెస్ అడ్వయిజరీ కమిటీ) సమావేశాన్ని సైతం బీఆర్ఎస్ బహిష్కరించింది. ఓవైపు సభలో ప్రభుత్వాన్ని కడిగిపారేస్తామని, సర్కార్ వైఫల్యాలను ఎండగడతామని, ప్రభుత్వాన్ని నిలదీయడానికి తాము సరిపోతామని, కేసీఆర్ రానవసరం లేదని ప్రకటనలు చేసిన బీఆర్ఎస్ నేతలు.. చివరకు అసెంబ్లీ మొదటి రోజునే కనీసం సభలోకే రాకుండా గందరగోళం సృష్టించారు.
పోలీసులపై బీఆర్ఎస్ ఆరోపణలు
= అసెంబ్లీ ప్రధాన ద్వారం దగ్గర మహిళా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీరను పోలీసులు లాగారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు.
= పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని, మగ పోలీసులు దురుసుగా వ్యవహరించారని సునీతా లక్ష్మారెడ్డి సైతం ఆరోపించారు.
= మహిళా ఎమ్మెల్యేలపై దురుసుగా ప్రవర్తించలేదని, చీర లాగినట్లు చేసిన ఆరోపణల్లో నిజం లేదని, అయినా వీడియో ఫుటేజ్ పరిశీలిస్తామని డీసీపీ శిల్పవల్లి తెలిపారు.
= చాలామంది పోలీస్ ఆఫీసర్లను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే బెదిరించారని, ఆత్మస్థైర్యం దెబ్బతినేలా వార్నింగ్ ఇచ్చారని డీసీపీ తెలిపారు. స్పీకర్ ఆదేశాల మేరకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్నామని స్పష్టం చేశారు.
= పోలీసులు అనుచితంగా ప్రవర్తించారంటూ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి తదితరులు ఫిర్యాదు చేశారు. సమగ్ర నివేదిక సమర్పించాలంటూ డీజీపీని కమిషన్ ఆదేశించింది.

