కలం, స్పోర్ట్స్ : దులీప్ ట్రోఫీ ఫైనల్లో (Duleep Trophy Final) ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) చరిత్ర సృష్టించాడు. తిలక్ వర్మ నేతృత్వంలోని సౌత్ జోన్‌పై విధ్వంసకర ద్విశతకంతో విరుచుకుపడి మ్యాచ్‌ను పూర్తి తమవైపు తిప్పుకున్నాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో దులీప్ ట్రోఫీ ఫైనల్ చరిత్రలో డబుల్ సెంచరీ చేసిన ఐదో బ్యాటర్‌గా ఇషాన్ రికార్డు పుటలకెక్కాడు. టోర్నీ తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఈస్ట్ జోన్ 4 వికెట్లకు 385 పరుగులు చేసింది. అప్పటికి ఇషాన్ 111 రన్స్‌తో, కుమార్ కుశాగ్ర 63 రన్స్‌తో నాటౌట్‌గా ఉన్నారు. వీరిద్దరూ కేవలం 26.4 ఓవర్లలోనే 144 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ప్రత్యర్థిపై విరుచుకుపడ్డాడు.
రెండో రోజు ఆటలో కుమార్ కుశాగ్ర కూడా సెంచరీ పూర్తి చేసి అవుట్ అయ్యాడు. అయినా ఇషాన్ ఏమాత్రం తగ్గలేదు. కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో చెలరేగి ద్విశతకాన్ని అందుకున్నాడు. ఈ క్రమంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 4,000 పరుగుల మైలురాయి దాటడంతో పాటు తన 10వ సెంచరీని నమోదు చేశాడు. గతంలో రామన్ లాంబ, అంశుమాన్ గైక్వాడ్, ఛెతేశ్వర్ పుజారా, యశస్వి జైస్వాల్ మాత్రమే దులీప్ ట్రోఫీ ఫైనల్లో ద్విశతకాలు సాధించారు. ఇప్పుడు ఆ దిగ్గజాల రికార్డు సరసన ఇషాన్ నిలిచాడు.

