కలం, ధర్మపురి: దక్షిణ కాశీగా, ప్రసిద్ధ నవనారసింహ క్షేత్రంగా పేరుగాంచిన జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రం (Dharmapuri Temple) లో మరో చారిత్రక ఘట్టానికి తెరలేవనుంది. వందల సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఉగ్ర నరసింహస్వామి ఆలయ పునర్ నిర్మాణానికి అడుగులు ముందుకు పడుతున్నాయి. ధర్మపురి ఆలయ అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 10 కోట్ల నిధులను కేటాయించింది.
ఆలయ పునర్ నిర్మాణ పనులకు సంబంధించి సోమవారం తెల్లవారుజామున 2:48 గంటలకు వేద పండితులు ఖరారు చేసిన శుభ ముహూర్తంలో భూమి పూజ కార్యక్రమం వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై పునర్ నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు.
వందేళ్ల అవసరాలకు తగ్గట్టుగా విస్తరణ
ప్రస్తుతం ఉన్న ఉగ్ర నరసింహస్వామి ఆలయ గర్భాలయం, ప్రాంగణం కేవలం 990 చదరపు అడుగుల విస్తీర్ణంలో మాత్రమే ఉండటంతో, రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల రద్దీకి తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యంలో రాబోయే వందేళ్లలో పెరిగే భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని, ప్రముఖ స్తపతుల పర్యవేక్షణలో, పూర్తిగా ఆగమ శాస్త్ర నియమాలకు లోబడి నూతన ఆలయాన్ని విస్తరించనున్నారు. ఈ పనులకంటే ముందే ధర్మపురిలోని వేద బ్రాహ్మణులు, అగ్రహార పెద్దలు, స్థానిక ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం సేకరించింది.
చారిత్రక శోభతో విలసిల్లుతున్న క్షేత్రం
గోదావరి నది ‘దక్షిణ వాహిని’గా ప్రవహించే ఈ పుణ్యక్షేత్రంలో బ్రహ్మ, విష్ణు (శ్రీ యోగనంద లక్ష్మీనరసింహస్వామి), శివ (శ్రీ రామలింగేశ్వరస్వామి) లు ఒకే ప్రాంగణంలో కొలువుదీరి ఉండటంతో ఇది ‘త్రిమూర్తి క్షేత్రం’గా, ‘హరిహర క్షేత్రం’గా ప్రసిద్ధి చెందింది. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ శ్రీ యమధర్మరాజు ఆలయం కూడా ఉండటం ప్రత్యేకత. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక చొరవతో రూ. 10 కోట్లతో ప్రారంభమవుతున్న ఈ ఆలయ పునర్ నిర్మాణ పనుల పట్ల ధర్మపురి ప్రజలు, వేద పండితులు, భక్తజనం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

