కలం, ఖమ్మం బ్యూరో: కాంగ్రెస్ పార్టీ వైభవంగా నిర్వహిస్తున్న 1000 రోజుల పాలన వేడుకల వేదికపై ఊహించని సంఘటన చోటుచేసుకుంది. “1000 రోజుల సంబరాలు సరే… మరి ఎన్నికల ముందు మాట ఇచ్చిన రూ. 4,000 పెన్షన్ ఎప్పుడిస్తావ్?” అంటూ ఓ వృద్ధుడు నేరుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేను నిలదీయడంతో సభలో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం, చంద్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘1000 రోజుల సంబరాల’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలకు స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ (MLA Jare Adinarayana) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేదికపై నేతల ప్రసంగాలు, సంబరాలు ఉత్సాహంగా సాగుతున్న సమయంలో.. గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు ధైర్యంగా ముందుకు వచ్చి ఎమ్మెల్యేను నేరుగా ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ. 4,000 పెన్షన్ ఎప్పటి నుంచి ఇస్తారని సభా ముఖంగానే నిలదీశారు. వృద్ధుడి నుంచి ఎదురైన ఈ ఊహించని ప్రశ్నతో ఎమ్మెల్యేతో పాటు వేదికపై ఉన్న స్థానిక నాయకులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.
అయితే, వృద్ధుడి ప్రశ్నతో ఇరకాటంలో పడిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సరైన, స్పష్టమైన సమాధానం చెప్పలేకపోయారు. విలేకరులు, ప్రజలు చూస్తుండగానే పొంతనలేని మాటలతో విషయాన్ని పక్కకు మళ్లించేందుకు తీవ్రంగా ప్రయత్నించి ప్రశ్నను దాటవేశారు. సొంత నియోజకవర్గంలో, అదీ పండగలా నిర్వహిస్తున్న సంబరాల వేదికపైనే కాంగ్రెస్ హామీలపై జనాగ్రహం వెల్లువెత్తడం ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై క్షేత్రస్థాయిలో ప్రజలు ఎంత అసంతృప్తితో ఉన్నారో ఈ సంఘటన అద్దం పడుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

