కలం, వెబ్ డెస్క్: అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన ముడి చమురు రవాణా మార్గం ‘హర్మూజ్ జలసంధి’ (Hormuz Strait ) వేదికగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య మళ్లీ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హర్మూజ్ జలసంధి గుండా అమెరికా రక్షణతో వెళ్తున్న 3 ఆయిల్ ట్యాంకర్లతో పాటు అనుమతి లేకుండా వెళ్తున్న మరో మూడు నౌకలపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ( IRGC) విరుచుకుపడింది. ఆ నౌకలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడినట్లు ఇరాన్ ప్రకటించింది.
తమ దేశానికి చెందిన ఆయిల్ ట్యాంకర్లపై అమెరికా సైనిక దళాలు జరిపిన దాడులకు ప్రతీకారంగా ఈ దాడులు నిర్వహించినట్లు వెల్లడించింది. ఈ దాడుల్లో అమెరికా నౌకలు తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొంది. అనంతరం అవి హర్మూజ్‌ను విడిచి వెళ్లిపోయాయని వివరించింది. అయితే అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల హర్మూజ్ లో నౌకలు దెబ్బతినడం వల్ల ఆ మార్గంలో రవాణా చేస్తున్న ఇతర అంతర్జాతీయ కార్గో షిప్పులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నాయి.
కాగా, అంతర్జాతీయంగా రవాణా అయ్యే ముడి చమురులో దాదాపు 20 శాతం ఈ హర్మూజ్ జలసంధి గుండానే సాగుతోంది. అయితే అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల ఈ మార్గంలో ప్రతిరోజూ తిరిగే వందలాది నౌకల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఇక ఇప్పుడు హర్మూజ్ వేదికగా మళ్లీ అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధ పరిస్థితుల నెలకొనడంతో పశ్చిమాసియా దేశాల నుంచి ఆసియా, ఐరోపా దేశాలకు జరిగే సరఫరా గొలుసు దెబ్బతినే ప్రమాదం ఉందనే సంకేతాలు వెలువడుతున్నాయి. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉండొచ్చని ప్రపంచ ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

