కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Nirmal Road Accident) ఓ వ్యక్తి మృతి చెందాడు. చింతకుంటవాడకు చెందిన లక్ష్మీనారాయణవర్మ (50) వృత్తిరీత్యా ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. గురువారం రాత్రి ఓ శుభకార్యానికి హాజరై అర్ధరాత్రి సమయంలో సుమారు 12 గంటల ప్రాంతంలో ద్విచక్రవాహనంపై ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని జయశంకర్ సర్కిల్ వద్ద రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో బస్టాండ్ వైపు నుంచి వచ్చిన లారీ ఆయన ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. బైక్ లారీకి ఇరుక్కుపోవడంతో బైక్ తో పాటు లక్ష్మీనారాయణవర్మను కొంతదూరం లారీ ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

