కలం, ఖమ్మం బ్యూరో: సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అటవీ, రెవెన్యూ భూముల సరిహద్దు వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivasa Reddy) స్పష్టం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఏ ఒక్క రైతు నష్టపోకూడదన్నారు. సబ్ రిజిస్ట్రార్లు, తహసీల్దార్ల పనితీరుపై దినపత్రికల్లో వస్తున్న కథనాలను ప్రస్తావిస్తూ, అధికారుల ప్రవర్తనలో మార్పు రాకపోతే కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడేది లేదని హెచ్చరించారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్‌లో సీసీఎల్ఏ డీ.ఎస్.లోకేశ్ కుమార్, ప్రత్యేక కార్యదర్శి రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఎలాంటి వేధింపులు ఉండొద్దు..
మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. కలెక్టర్లు, అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా శాస్త్రీయ పద్ధతుల్లో కొలతలు చేపట్టి అటవీ రెవెన్యూ సరిహద్దు వివాదాలను తేల్చాలని ఆదేశించారు. గతంలో పోడు భూములకు పట్టాలు పొందిన రైతులు బోర్లు, విద్యుత్ కనెక్షన్లు పొందే సమయంలో ఎలాంటి వేధింపులకు గురిచేయకూడదని తేల్చిచెప్పారు. ధరణి స్థానంలో ప్రభుత్వం తెచ్చిన ‘భూ భారతి’ చట్టం ద్వారా ప్రతి భూ యజమానికి చట్టబద్ధమైన హక్కులు కల్పించడమే తమ లక్ష్యమన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పనిచేసే ధైర్యం అధికారులకు ఎవరిచ్చారని ప్రశ్నించిన మంత్రి, తప్పు చేసిన వారిపై శాఖాపరమైన చర్యలు తక్షణమే ఉంటాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
లంచాలు తీసుకుంటే వదలబోం..
ప్రభుత్వం చేపట్టిన రీ-సర్వే విధులకు రాకుండా కేవలం ప్రైవేట్ సర్వేలకే పరిమితమయ్యే లైసెన్స్‌డ్ సర్వేయర్లకు వెంటనే నోటీసులు జారీ చేయాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల పనులు ప్రారంభం కాని వాటిని రెండో విడత జాబితాలోకి మార్చాలని సూచించారు. లబ్ధిదారులకు వెసులుబాటు కల్పించేందుకు రవాణా ఖర్చులతో కలిపి సిమెంట్ బస్తాను రూ.230లకే అందిస్తున్నామని వివరించారు. ఇళ్ల మంజూరు ప్రక్రియలో లంచాలు లేదా అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదని స్పష్టం చేశారు. పారదర్శకత కోసం జనగామ కలెక్టర్ రూపొందించిన యాప్‌ను మిగతా జిల్లాల కలెక్టర్లు కూడా అమలు చేయాలని సూచించారు.
ఈ సమీక్షలో ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, పాయం వెంకటేశ్వర్లు, మాలోత్ రాందాస్ నాయక్, కోరం కనకయ్య, డాక్టర్ మట్టా రాగమయి, జారే ఆదినారాయణ, తెల్లం వెంకట్రావ్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు దివాకర్, అంకిత్, అదనపు కలెక్టర్లు, భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్, డీఎఫ్‌ఓ విక్రమ్ సింగ్‌తో పాటు రెవెన్యూ, రిజిస్ట్రేషన్, హౌసింగ్, సర్వే, ఫారెస్ట్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

