మహిళలు, చిన్నారుల భద్రతకు కొత్త కవచం

కలం, ఖమ్మం బ్యూరో: మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లా పోలీస్ శాఖ కీలక ముందడుగు వేసింది. తెలంగాణ రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఆదేశాల మేరకు జిల్లాలో నూతనంగా ‘జిల్లా మహిళా భద్రతా విభాగం’ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో నూతన విభాగ సభ్యులతో సమావేశమైన ఎస్పీ.. వారి విధులు, బాధ్యతలపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

జిల్లాలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆపదలో ఉన్న బాధితులకు ఎల్లప్పుడూ అండగా నిలవాలని సూచించారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలను అరికట్టడంతో పాటు బాధితులకు తక్షణ సహాయం అందించడం, నమోదైన కేసుల దర్యాప్తును పర్యవేక్షించడం, విచారణలో నాణ్యతను పెంచడం ఈ విభాగం ప్రధాన లక్ష్యాలని ఎస్పీ తెలిపారు. క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, బాధితులకు అవసరమైన చట్టపరమైన సహాయం, కౌన్సెలింగ్, పునరావాస సేవలను సమన్వయంతో అందించడం కూడా విభాగం బాధ్యతల్లో భాగమని స్పష్టం చేశారు.

జిల్లాలో ఇప్పటికే పనిచేస్తున్న షీ టీమ్స్, మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం, మహిళా పోలీస్ స్టేషన్, కౌన్సెలింగ్ కేంద్రాలతో నూతన విభాగం సమన్వయంతో పనిచేస్తుందని ఎస్పీ వెల్లడించారు. నమోదైన కేసుల విచారణను వేగవంతం చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్బీ ఇన్స్పెక్టర్ ఇ. శ్రీనివాస్, ఎస్ఐ శ్రీనివాస్, ఏఎస్ఐ కస్తూరి తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>