కలం, జడ్చర్ల : సుష్మిత మాటాలకు రేవంత్ రెడ్డి కొండా సురేఖ (Konda Surekha) ను బలి చేశారని బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షుడు బూరుగుపల్లి కృష్ణ యాదవ్, రజక సంఘం జాతీయ అధ్యక్షుడు నడిమింటి శ్రీనివాసులు దుయ్యబట్టారు. గురువారం జడ్చర్లలో వారు విలేకరులతో మాట్లాడుతూ తన కూతురు మాట్లాడిన మాటలు ఆమె వ్యక్తిగత అభిప్రాయమని మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఆమెను మంత్రి పదవి నుండి తొలగించడం వెనక బీసీలను రాజకీయంగా అణచివేయాలన్న కుట్ర దాగుందని అన్నారు.
మంత్రి పదవి రాలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి తదితరులు తీవ్ర వ్యాఖ్యలు చేసినప్పుడు అగ్రకుల నాయకులు కావడం వల్లే స్పందించలేదని అన్నారు. బీసీ ప్రజా ప్రతినిధులను మనుషులుగా కూడా గౌరవించడం లేదని, బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలను సహించమని స్పష్టం చేశారు. బీసీలను అవమానించే నాయకులకు వచ్చే ఎన్నికల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో గుణపాఠం చెబుతామని, ముఖ్యమంత్రి, ఆయన సోదరులపై వస్తున్న భూ ఆక్రమణల ఆరోపణలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
పార్టీ అధిష్టానం పునరాలోచన చేసి సురేఖను మంత్రి పదవిలో కొనసాగించాలన్నారు. లేనియెడల వచ్చే ఎన్నికలలో అధికార పార్టీకి రాజకీయ పతనం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు నడిమింటి శ్రీనివాస్,, సురభి విజయ్ కుమార్, బదనమోని వెంకటేష్, శివశంకర్, ప్లంబర్ శ్రీనివాస్, రోహిత్, నాయకులు బిక్ష నాయక్, చెన్న కేశవులు,, శ్రీనివాస్‌లు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

