కలం, స్పోర్ట్స్: ఐపీఎల్ 2027కి ముందు చెన్నై సూపర్ కింగ్స్‌లో కీలక మార్పు చేయాలని మాజీ క్రికెటర్ సదగోపన్ రమేశ్ సూచించాడు. కెప్టెన్సీ మార్చాలని నిర్ణయిస్తే సంజూ శాంసన్‌ను గట్టిగా పరిశీలించాలని చెప్పాడు. ఐపీఎల్ 2026లో రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో సీఎస్‌కే ఎనిమిదో స్థానంలో నిలిచింది. దీంతో వచ్చే సీజన్‌కు జట్టును పూర్తిగా పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని రమేశ్ అభిప్రాయపడ్డాడు. సంజూకు కెప్టెన్సీ అనుభవం ఉందని రమేశ్ గుర్తుచేశాడు. ఐపీఎల్‌లో 66 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన సంజూ 33 మ్యాచ్‌ల్లో జట్టును గెలిపించాడు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా కూడా సంజూ మంచి ఫలితాలు సాధించాడు.
ఐపీఎల్ 2026లోనూ..
అతడి నాయకత్వంలో ఆ జట్టు ఒకసారి ఫైనల్‌కు చేరింది. మరోసారి ప్లేఆఫ్స్‌కు వెళ్లింది. ఐపీఎల్ 2026లోనూ సంజూ బ్యాట్‌తో రాణించాడు. 14 మ్యాచ్‌ల్లో 477 పరుగులు చేశాడు. 43.36 సగటుతో, 165.63 స్ట్రైక్‌రేట్‌తో ఆడాడు. అయితే కెప్టెన్‌ను మార్చడం ఒక్కటే CSK సమస్యలకు పరిష్కారం కాదని రమేశ్ స్పష్టం చేశాడు. జట్టులో ఇంకా పలు మార్పులు అవసరమని పేర్కొన్నాడు. మరోవైపు CSK ఇప్పటికే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌తో విడిపోయింది. దీంతో IPL 2027కి ముందు జట్టు నాయకత్వంలో మరిన్ని మార్పులు ఉంటాయా అన్న ఆసక్తి నెలకొంది.

