వెయ్యి రోజుల పాలనపై ప్రజల్లో ఆనందం : ఒబేదుల్లా కొత్వాల్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చుతున్నట్లు రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ (Obedullah Kothwal) అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ తో కలిసి కొత్వాల్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై మాకు ఎంతో గర్వంగా ఉందన్నారు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, ఇవ్వని హామీలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తూ దేశంలోనే ఉత్తమ పాలన అందిస్తున్నామని తెలిపారు. వెయ్యి రోజుల మచ్చలేని పాలనను చూసి ఓర్వలేక బీఆర్ఎస్ ఆందోలన బాట చేపట్టిందని ఆరోపించారు. మహబూబ్ నగర్ పట్టణంలో మాజీ మంత్రి పెట్టిన ఫ్లెక్సీ ర్యాలీని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గత పదేళ్లలో ఉమ్మడి జిల్లాలో సాగునీటి విషయాన్ని పూర్తిగా మరిచిపోయి ఈ జిల్లాను ఎడారిగా మార్చారని ఆరోపించారు. గత పదేళ్లలో బిఆర్ఎస్ హయాంలో విధ్వంస పాలన కొనసాగిందని విమర్శించారు.

తాగు, సాగునీరు, వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు.కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు రూ. 1,72,000 కోట్లతో వ్యవసాయ రంగానికి ఊతమిచ్చిందని అన్నారు. 25 లక్షలమంది రైతులకు రూ.20,617 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమచేసి రుణమాఫీ చేసినట్లు గుర్తుచేశారు. మా పాలనలో రైతులు ఆనందంగా ఉన్నారని, పండించిన పంటకు గిట్టుబాటు ధర, బోనస్ ఇచ్చి రైతుల్లో మనోధైర్యాన్ని నింపినట్లు తెలిపారు.

కొడంగల్- నారాయణపేట ఎత్తిపోతల పథకం, కొల్లాపూర్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. సీడ్ డెవలవ్ మెంట్ కార్పొరేషన్, ఆగ్రో ఇండస్ట్రీస్ వంటి మూతపడిన కార్పొరేషన్లను మళ్లీ బలోపేతం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందన్నారు. సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అఖ్తర్, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రకుమార్ గౌడ్, మీడియాసెల్ కన్వీనర్ సీజే బెనహర్ తదితరులు పాల్గొన్నారు

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>