కలం, కరీంనగర్: నల్గొండ జిల్లా కేంద్రంలో బీజేపీ కార్యాలయంతో పాటు జిల్లా అధ్యక్షుడు డా. నాగం వర్షిత్ రెడ్డి నివాసంపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేయడంపై బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కార్యాలయంలో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, సామాజిక సంస్కర్త సంత్ రవిదాస్ చిత్రపటంపై నల్ల సిరా చల్లడాన్ని నిరసిస్తూ గురువారం జిల్లావ్యాప్తంగా బీజేపీ ఎస్సీ మోర్చా (BJP SC Morcha) ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
సీఎం దిష్టిబొమ్మ దహనం..
రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. పలు ప్రాంతాల్లో బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. చొప్పదండి కేంద్రంలో జరిగిన నిరసన కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయిని మల్లేశం మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కార్ గుండాగిరి, దౌర్జన్యాలకు పాల్పడుతుందని ఆరోపించారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. నల్గొండ బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి నివాసంలోకి కాంగ్రెస్ గుండాలు చొరబడి వస్తువులన్నీ ధ్వంసం చేయడమే కాకుండా ఆ సమయంలో ఇంట్లో ఉన్న వర్షిత్ రెడ్డి తల్లిపై కూడా భౌతిక దాడి చేయడంతో ఆమెకు గాయాలపాలై గుండెపోటు కూడా గురైందని విమర్శించారు.
కాంగ్రెస్ దుండగులు రంగు చల్లారు..
అంతేకాకుండా దాడుల సమయంలో కార్యాలయంలో ఉన్న మహనీయులు సంత్ రవిదాస్ జీ చిత్రపటంపై కాంగ్రెస్ దుండగులు నల్ల రంగు చల్లారని ఆరోపించారు. ఆ మహనీయుడిని ఇలా అవమానించడం తగదన్నారు. దళిత సమాజం, సమాజంలోని అన్ని వర్గాల మనోభావాలను కాంగ్రెస్ తీవ్రంగా గాయపరిచిందన్నారు. సంత్ రవిదాస్ చిత్రపటాన్ని అవమానించిన వారిపై సమగ్ర విచారణ జరిపి, చట్ట నిబంధనల ప్రకారం ఎస్సీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిందితులందరినీ తక్షణమే అరెస్ట్ చేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. దాడులు చేసిన వారిని వదిలేసి పరామర్శించడానికి వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును అరెస్టు చేయడంపై ఆయన మండిపడ్డారు.
తిమ్మాపూర్ లో దిష్టిబొమ్మ దహనం..
బీజేపీ తిమ్మాపూర్ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి, మండల అధ్యక్షులు చింతం శ్రీనివాస్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు ఎలుకపెల్లి స్వామి, జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర, జిల్లా ఈసీ మెంబర్ బుట్ల శ్రీనివాస్, మువ్వరపు సంపత్ మండల జనరల్ సెక్రెటరీ గొట్టిముక్కల తిరుపతిరెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు బోనాల మోహన్, బీజేవైఎం మండల అధ్యక్షులు గడ్డం అరుణ్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు దుర్షేడ్ రమేష్ సీనియర్ నాయకులు తమ్మన వేణి రాజు యాదవ్, బుర్ర శ్రీనివాస్ గౌడ్, వరకోలు సమ్మయ్య, వేల్పుల ఓదేలు జంగా సునీల్ రెడ్డి, జాడి రాజు, ప్రదీప్ రెడ్డి, హరిదాస్, పాశం అజయ్, అనిల్, అజయ్ లతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.

