మాటలు నమ్మరని.. కాగితాలతో దగా చేసిన దుద్దిళ్ల: పుట్ట మధు

కలం, కరీంనగర్ బ్యూరో: మోసపూరిత మాటలు ప్రజలు నమ్మరని.. కాగితాలతో దగా చేసిన ఘనుడు దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) అని బీఆర్ఎస్ నేత, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ (Putta Madhukar) మండిపడ్డారు . బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ముత్తారం మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ 1,000 రోజుల పాలనలో వ్యవసాయ రంగానికి  నష్టం జరిగిందని నిరసిస్తూ భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందుగా రైతులతో కలిసి ఎడ్ల బండ్ల ర్యాలీ నిర్వహించి వ్యవసాయ రంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ నిరసన చేపట్టారు.

మాయమాటలు చెప్పారు..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారం కోసం అనేక మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వత ఇచ్చిన హమీలను విస్మరించారని అన్నారు. మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌ మానీపెస్టో రాసి అనేక అంశాలను పొందుపర్చి ఒక్క పథకాన్ని అమలు చేయకుండా మంథని ప్రజలతో పాటు యావత్తు రాష్ట్ర ప్రజలను మోసం చేశాడని  దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఇచ్చిన హమీలను అమలు చేస్తామని చెప్పిన దుద్దిళ్ల.. వేయి రోజులైనా తాను రాసిన మానీఫెస్టోలో ఒక్క పథకాన్ని అమలు చేయలేదన్నారు.

సర్కార్ పై ఫైర్..

ప్రభుత్వం పత్రిక ప్రకటనలకు కేటాయించే డబ్బులను ప్రజలకు కేటాయిస్తే నాలుగు వేల రూపాయల పించన్‌ వచ్చేదని పుట్ట మధు (Putta Madhukar) ఎద్దేవా చేశారు. అందాల పోటీల్లో పెట్టిన బంగారంతో మన అక్కా చెల్లెల పిల్లల పెళ్లిళ్లకు తులం బంగారం వచ్చేదని విమర్శించారు. అలా చేయకుండా దోపిడి కోసమే సమయం కేటాయిస్తూ.. చేసిన దోపిడిని ఢిల్లీకి కప్పం కడుతున్నారని ఆరోపించారు. రాహుల్‌ గాంధీకి సంచులు ముట్టబెప్తూ ప్రజల డబ్బంతా ఢిల్లీకి చేరవేస్తున్నారని అన్నారు. రైతులు, ప్రజలను అప్రమత్తం చేస్తే ఢిల్లీకి పంపే డబ్బులను ఇక్కడి ప్రజలకు కేటాయించి మేలు చేస్తారని బీఆర్‌ఎస్‌ పార్టీ పోరాటం చేస్తుందన్నారు.

హృదయమంతా చీకటే..

చదువుకున్న మేధావినని.. తనను చూసి ఓటు వేయమన్న దుద్దిళ్ల శ్రీధర్‌ది ముఖమంతా తెల్లగుంటే హృదయమంతా చీకటి ఉంటదని మానీఫెస్టో ద్వారా చూపించాడని పుట్ట మధుఎద్దేవా చేశారు. రాసిన మానీఫెస్టో, చేసిన డిక్లరేషన్‌లనే అడుగుతున్నామని.. వీటన్నింటికీ దుద్దిళ్ల సమాధానం చెప్పాలన్నారు. తొమ్మిదిన్నర ఏండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రైతులు సంతోషంగా ఉంటే ఓర్వలేక పోయారని, రైతు డిక్లరేషన్‌ పేరుతో అనేక హమీలు ఇచ్చి మరీ మోసం చేశారన్నారు.

ఎంత మందికి రుణమాఫీ చేశారు..

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలో రెండులక్షల రుణమాఫీ, ఇందిరమ్మ భరోసా అమలు చేస్తమని ఇప్పటికి ఎంత మందికి రుణమాఫీ చేశారో చెప్పాలని పుట్టమధు డిమాండ్‌ చేశారు. భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు ఏడాదికి ఎకరానికి రూ.15 వేలు ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. ఒక్కటి కాదు రెండు కాదు అనేక హమీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల పక్షాన మాట్లాడితే స్థానిక కాంగ్రెస్‌ నాయకులు మాత్రం ప్రజలకు మేలు చేయకుండా మంథని ఎమ్మెల్యే చెప్పుల దగ్గరకు పోయి వచ్చి ఇక్కడ సిపాయి మాటలు మాట్టాడుతున్నారని విమర్శించారు.

సీలింగ్‌ పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు..

భూబారతి (Bhu Bharati) తీసుకువచ్చి 22ఏతో అందరి భూములను సీలింగ్‌ పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మధు వాపోయారు. ఇందిరమ్మ రాజ్యంలో రైతు సంక్షేమం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌కు ఈ ప్రాంత ప్రజలతో ఓటు సంబంధం తప్ప పేగు సంబంధం లేదని పదేపదే చెప్తున్నానని అన్నారు. వేలు పట్టుకుని నడిపించిన తనపై రౌడీ షీట్‌ ఓపెన్‌ చేయించాడని, అన్నం పెట్టినోళ్లపై అక్రమ కేసులు పెట్టిన చరిత్ర దుద్దిళ్లదేనని విమర్శించారు. ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు రైతులకు నష్టం జరుగకుండా రెట్టింపు పరిహారం ఇప్పిస్తే.. వాళ్లను మోసం చేసేలా కాళేశ్వరం ప్రాజెక్టులో ముంపుకు గురైన భూముల రైతులను ఆదుకుంటామని, కరకట్టలు కడుతామని, రెట్టింపు పరిహారం ఇస్తామని మానీఫెస్టో రాసి ఏ ఒక్కటైనా అమలు చేశారా? అని నిలదీశారు.

ఆ ఘనత కేసీఆర్‌దే..

అభివృద్ది సాధించాలంటే రైతుతోనే సాధ్యమైతదని ఆనాడు బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వం రాగానే అనేక పథకాలు మొదలు పెట్టి రైతుబంధు, 24గంటల కరెంటు, ఎరువులు ఇచ్చిన చరిత్ర కేసీఆర్‌కే దక్కుతుందని పుట్ట మధు కొనియాడారు. రైతులు చైతన్యవంతులై కాంగ్రెస్‌ పార్టీకి బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ‘అప్పులు ఉన్నాయి.. సంపద సృష్టిస్తాం, పథకాలు అమలు చేస్తాం’ అని  చెప్పిన దుద్దిళ్ల ఎలా మోసం చేస్తున్నాడో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్‌ ప్రజా పాలనపై అన్ని వర్గాలు విసుగు చెందాయని, మళ్లీ కేసీఆర్‌ వస్తేనే సబ్బండ వర్గాలకు మేలు జరుగుతుందని ఆకాంక్షిస్తున్నారని చెప్పారు. రాబోయే కాలం బీఆర్‌ఎస్‌ పార్టీదేనని అందరికి అర్థం అయిందన్నారు. ప్రజల పక్షాన పోరాటం చేసే ఏకైక పార్టీ బీఆర్‌ఎస్‌ అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.

Also Read : ప్రపంచ వేదికపై భారత మహిళల ధమాకా!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>