కలం, స్పోర్ట్స్: కేరళ అంటేనే ఫుట్‌బాల్‌కు ప్రత్యేక గుర్తింపు. మైదానం కనిపిస్తే చాలు ఆట మొదలవుతుంది. స్థానిక టోర్నీలకే వేలాది మంది అభిమానులు తరలివచ్చేంతగా అక్కడ ఫుట్‌బాల్‌కు ఆదరణ ఉంది. అయితే ఈ అభిమానాన్ని శాశ్వత ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ వ్యవస్థగా మార్చడం మాత్రం ఇప్పటికీ పెద్ద సవాలే. ఈ దిశగా సూపర్ లీగ్ కేరళ (Super League Kerala) కీలక అడుగులు వేస్తోంది. సెప్టెంబర్ 25 నుంచి లీగ్ మూడో సీజన్ ప్రారంభం కానుంది. మొత్తం ఆరు జట్లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. గత సీజన్‌లో కన్నూర్ వారియర్స్ ఛాంపియన్‌గా నిలిచింది. ఈసారి టైటిల్ పోరుతో పాటు కేరళ ఫుట్‌బాల్‌కు దీర్ఘకాలిక పునాది వేయడంపైనా లీగ్ దృష్టి సారించింది.
డబ్బే కాదు.. స్థిరత్వం ముఖ్యం
SLK లక్ష్యం కేవలం ఆదాయాన్ని పెంచుకోవడం కాదు. క్లబ్బులు ఆర్థికంగా బలపడటం, ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు కల్పించడం, అభిమానుల సంఖ్య పెంచడం, లీగ్(Super League Kerala)ను దీర్ఘకాలం కొనసాగించడం ప్రధాన ఉద్దేశాలుగా ఉన్నాయి. ఇందుకోసం ‘360 డిగ్రీ సస్టైనబిలిటీ’ మోడల్‌ను అమలు చేస్తున్నారు. ప్లేయర్ బడ్జెట్‌ను రూ.1.75 కోట్లకు పరిమితం చేయగా.. టెక్నికల్ స్టాఫ్ బడ్జెట్‌కు రూ.25 లక్షల పరిమితి విధించారు. క్లబ్బులు టికెట్ విక్రయాలు, స్పాన్సర్‌షిప్‌లు, మెర్చండైజ్, అకాడమీ ద్వారా వచ్చే ఆదాయాన్ని పూర్తిగా ఉంచుకునే అవకాశం కల్పించారు. లీగ్ ద్వారా వచ్చే కేంద్ర ఆదాయంలో ప్రస్తుతం 40 శాతం క్లబ్బులకు వెళ్తోంది. గత సీజన్‌లో లీగ్, జట్ల కలిపి వ్యయం దాదాపు రూ.90 కోట్లకు చేరింది.
ఇక డ్రా ఉండదు!
ఈ సీజన్‌లో మ్యాచ్‌ల నిబంధనల్లోనూ కీలక మార్పు చేశారు. గ్రూప్ దశలో ఇక డ్రా ఉండదు. 90 నిమిషాల తర్వాత స్కోరు సమంగా ఉంటే నేరుగా పెనాల్టీ షూటౌట్ నిర్వహిస్తారు. సాధారణ సమయంలో గెలిచిన జట్టుకు మూడు పాయింట్లు లభిస్తాయి. షూటౌట్‌లో గెలిచిన జట్టుకు రెండు, ఓడిన జట్టుకు ఒక పాయింట్ ఇస్తారు. దీంతో ప్రతి మ్యాచ్‌కు తుది ఫలితం ఉండనుంది. ఈ మార్పుతో పోటీతత్వం, అభిమానుల్లో ఆసక్తి మరింత పెరుగుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు. సెమీఫైనల్స్‌ను హోమ్, అవే పద్ధతిలో నిర్వహించనున్నారు. దీంతో మొత్తం మ్యాచ్‌ల సంఖ్య 33 నుంచి 35కి పెరగనుంది.
టీవీ కంటే డిజిటల్‌పై దృష్టి
మ్యాచ్‌లను మరింత విస్తృత ప్రేక్షకులకు చేరువ చేసేందుకు SLK డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. జీ5ను ఓటీటీ భాగస్వామిగా తీసుకుంది. దీని ద్వారా దేశంలోని అభిమానులతో పాటు విదేశాల్లో ఉన్న మలయాళీలను కూడా ఆకర్షించాలని భావిస్తోంది. గల్ఫ్ దేశాలు, యూరప్, ఉత్తర అమెరికాలో భారీగా ఉన్న మలయాళీ ప్రేక్షకులను లీగ్‌కు అనుసంధానం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. మొబైల్ ఆధారిత ప్రసారాలు, మరిన్ని కెమెరా యాంగిల్స్, ఇంటరాక్టివ్ వ్యూయింగ్ వంటి అవకాశాలను కూడా పరిశీలిస్తోంది.
అసలు బలం గ్రాస్‌రూట్స్
యువ ఆటగాళ్లను తయారు చేయడంపైనే SLK ప్రధానంగా దృష్టి సారించింది. ఇప్పటివరకు 52 అకాడమీల ద్వారా 17 వేలకు పైగా పిల్లలకు శిక్షణ ఇచ్చినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ‘ప్రాజెక్ట్ గేమ్ ఛేంజర్’ ద్వారా ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లను గుర్తిస్తున్నారు. ఈ ఏడాది కేరళలోని ఆరు ప్రాంతాల్లో సుమారు 3,500 మంది ఆటగాళ్లను స్కౌట్స్ పరిశీలించారు. క్లబ్బుల అవసరాలకు అనుగుణంగా ప్రతిభను గుర్తించి వారికి అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యం. గత సీజన్‌లో ఎంపికైన పలువురు యువ ఆటగాళ్లు SLK జట్లలో చోటు దక్కించుకున్నారు. దీంతో లీగ్ కేవలం మ్యాచ్‌లు నిర్వహించే వేదికగా కాకుండా.. యువ ప్రతిభకు తదుపరి అవకాశాలకు వారధిగా మారాలని ప్రయత్నిస్తోంది.
విదేశీ ఆటగాళ్లతో కొత్త అనుభవం
భారత యువ ఆటగాళ్లలో నైపుణ్యాన్ని పెంచేందుకు అనుభవజ్ఞులైన విదేశీ ఆటగాళ్లు, ప్రో లైసెన్స్ కోచ్‌లను తీసుకురావడంపైనా SLK దృష్టి పెట్టింది. వివిధ అంతర్జాతీయ లీగ్‌ల్లో ఆడిన ఆటగాళ్లతో కలిసి ఆడటం ద్వారా యువతకు కొత్త ఆటతీరులు పరిచయం అవుతాయని నిర్వాహకులు భావిస్తున్నారు. అదేవిధంగా అనుభవజ్ఞులైన కోచ్‌లతో పనిచేయడం వల్ల వ్యూహాలు, టెక్నిక్‌పై యువ ఆటగాళ్లకు మెరుగైన అవగాహన వస్తుందని చెబుతున్నారు. ఈ సీజన్‌లో మలప్పురం, ఫోర్కా కొచ్చి, కన్నూర్ వారియర్స్, కాలికట్ ఎఫ్‌సీ జట్లకు అనుభవం ఉన్న కోచ్‌లు బాధ్యతలు చేపట్టనున్నారు.
విస్తరణకు ఎందుకు బ్రేక్?
లీగ్‌ను ఆరు నుంచి ఎనిమిది జట్లకు పెంచాలని తొలుత భావించినప్పటికీ.. కొత్త ప్రాంతాల్లో అవసరమైన స్టేడియాలు, మౌలిక వసతులు అందుబాటులో లేకపోవడంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు. జట్ల సంఖ్యను పెంచడం కంటే ముందుగా ఉన్న వ్యవస్థను బలోపేతం చేయడమే మంచిదని SLK భావిస్తోంది. భవిష్యత్తులో క్లబ్బులు సొంత స్టేడియాలను కలిగి ఉండటం లేదా వాటిపై నియంత్రణ సాధించడం కూడా కీలకమని నిర్వాహకులు భావిస్తున్నారు. బలమైన మౌలిక వసతులు ఉంటేనే క్లబ్బులు దీర్ఘకాలంలో విలువైన క్రీడా సంస్థలుగా ఎదుగుతాయని చెబుతున్నారు.
టోర్నీ కాదు.. ఓ కొత్త ఫుట్‌బాల్ మోడల్
సూపర్ లీగ్ కేరళ ముందున్న అసలు సవాలు కేవలం టైటిల్ గెలవడం కాదు. క్లబ్బులు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. యువ ఆటగాళ్లు పైకి రావాలి. అభిమానుల సంఖ్య పెరగాలి. డిజిటల్ ప్రేక్షకులు పెరగాలి. అదే సమయంలో మౌలిక వసతులు కూడా బలోపేతం కావాలి. ఈ అంశాలన్నీ సమాంతరంగా ముందుకు సాగితేనే కేరళలో బలమైన ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ వ్యవస్థ ఏర్పడుతుంది. అందుకే మూడో సీజన్‌ను మరో ఫుట్‌బాల్ టోర్నీగా కాకుండా..కేరళ ఫుట్‌బాల్‌కు కొత్త మోడల్‌ను పరీక్షించే కీలక దశగా చూడొచ్చు.
Also Read : ప్రపంచ వేదికపై భారత మహిళల ధమాకా!
Follow Us On: X(Twitter)

