కలం, వెబ్ డెస్క్ : బొల్లారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంపు సమీపంలో ఆయుధాల మిస్సింగ్ కేసులో కీలక మలుపు తిరిగింది. ఆర్మీ క్యాంప్ సమీపంలో భారీగా డిటోనేటర్లు (Bollaram Detonators) లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. ఆయుధాల మిస్సింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలో ఈ ఘటన వెలుగుచూడటం కేసులో కీలక మలుపుగా మారింది.
ఫైరింగ్ రేంజ్ వెనుక గోడ సమీపంలో, గోల్ఫ్ ఎన్‌క్లేవ్ వెంచర్ వద్ద ఒక లేత ఆకుపచ్చ రంగు ప్లాస్టిక్ బకెట్ అనుమానాస్పదంగా కనిపించడంతో దాన్ని తనిఖీ చేశారు. ఆ బకెట్‌లో 8 బండిళ్లలో ప్యాక్ చేసి ఉన్న 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లను అధికారులు గుర్తించారు. ఒక్కో బండిల్‌లో 20 చొప్పున ఉన్న ఈ డిటోనేటర్ల మొత్తం విలువ సుమారు రూ.32 వేలు ఉంటుందని అంచనా వేశారు. బకెట్‌ను గమనించిన ఆర్మీ సిబ్బంది వెంటనే సమాచారం అందించడంతో బొల్లారం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, వాటిని స్వాధీనం చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు.

