కలం, వెబ్‌డెస్క్: ఢిల్లీ పర్యటనతో కొండా సురేఖ (Konda Surekha) వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను మరింత హీటెక్కించింది. ఖర్గేతో సమావేశం అనంతరం కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు అధిష్టానం, ఇటు సీఎం రేవంత్, సొంత పార్టీ నేతలపై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. దీంతో ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించడం ఖాయమని భావించడం వల్లే ఇలా మాట్లాడి ఉంటారని అందరూ భావిస్తున్నారు. ఈ తరుణంలో కొండా సురేఖ తన అనుచరులతో భేటీ కానున్నారన్న వార్తలు ఊపందుకున్నాయి.
కొండా సురేఖ ఖర్గేతో భేటీ అనంతరం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. నేడు వరంగల్‌లో తమ అనుచరులు, కాంగ్రెస్‌లో తమకు అనుకూలంగా ఉండే నాయకులతో భేటీ కానున్నారు. హైకమాండ్‌తో జరిగిన చర్చల గురించి వివరించనున్నారు. కొండా సురేఖ ఇప్పటికే తాను బీసీ మహిళను అని, తన సామాజిక వర్గాన్ని ప్రస్తావించి హైకమాండ్‌కు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో తనపై చర్యలు తీసుకుంటే తదుపరి ఏం చేయాలన్న దానిపై అనుచరులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వస్తే కొండా సురేఖ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసే ఛాన్స్ ఉందని చర్చ నడుస్తోంది. అనుచరులతో సమావేశం అనంతరం కొండా దంపతులు తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. నేడు ఏఐసీసీ కొండా సురేఖపై తుది నిర్ణయం ప్రకటించనుంది.

