కలం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సెక్రటేరియెట్ (Telangana Secretariat)లో భద్రతా విధానాలపై స్పష్టత కొరవడింది. రోజుకో కొత్త రూల్, ఎప్పటికప్పుడు మారుతున్న ఆంక్షలతో గేట్ల వద్ద విధులు నిర్వహించే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారనే చర్చ జరుగుతున్నది. సెక్రటేరియెట్‌లోకి ఏ సమయంలో ఎవరిని అనుమతించాలి? ఏ పాస్ చెల్లుతుంది? అనే అంశాలపై సిబ్బందికి ప్రతిసారీ కొత్త సూచనలు చేస్తున్నట్లు తెలిసింది. ఒకరోజు అనుమతించిన వ్యక్తులను మరోరోజు నిలిపివేయడం, ప్రోటోకాల్‌లో స్థిరత్వం లేకపోవడంతో సిబ్బంది గందరగోళానికి గురువుతున్నారని సమాచారం.
పాస్ విధానం
ఇదివరకు జర్నలిస్టులను అక్రిడేషన్ చూసి సెక్రటేరియెట్‌లోకి పంపేవారు. కానీ.. ఇప్పుడు ప్రభుత్వం జర్నలిస్టుల కోసం పాస్ విధానం అమలులోకి తెచ్చింది. సమాచార శాఖ కొన్ని పెద్దపత్రికలు, టీవీ చానళ్లకు మాత్రమే ఈ పాస్‌లను ఇవ్వడంతో మీడియం, చిన్న పత్రికలు, అప్ కంట్రీ పత్రికల జర్నలిస్టులకు ఇబ్బందిగా మారింది.
సెక్యూరిటీ బాధ్యత ఎస్పీఎఫ్దే
సెక్రటేరియెట్ సెక్యూరిటీ బాధ్యతను తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (టీజీఎస్పీఎఫ్)కు అప్పగిస్తూ 2024లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గేట్ల వద్ద సాయుధ భద్రత, పెట్రోలింగ్, ప్రవేశ నియంత్రణ, యాంటీ-సాబోటేజ్ తనిఖీలు వంటివన్నీ ఎస్పీఎఫ్ చూసుకుంటుంది. క్విక్ రియాక్షన్ టీమ్ (క్యూఆర్టీ) బాధ్యతలను ఆక్టోపస్, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ బాధ్యతలను హైదరాబాద్ సిటీ పోలీస్‌లు నిర్వహించేలా అప్పట్లో ఏర్పాట్లు చేశారు. అయితే ప్రస్తుతం భద్రతా విధుల్లో ఎవరి ఆదేశం తుది నిర్ణయం? ఏ పరిస్థితిలో ఎవరికి ప్రవేశం కల్పించాలి? అన్న అంశాల్లో స్పష్టమైన, స్థిరమైన ప్రోటోకాల్ అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఉద్యోగులకూ ఇబ్బందులే?
భద్రతా నిబంధనల మార్పులతో సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు, వివిధ శాఖలకు వచ్చే అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతర అవసరాల కోసం వచ్చే సందర్శకులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల సెక్రటేరియెట్ ఉద్యోగులు తమ పెండింగ్ బిల్లులు, పీఆర్సీ, డీఏ, ఈహెచ్ఎస్ సమస్యలపై బాహుబలి గేట్ వద్ద ఆందోళనకు దిగిన విషయం ప్రభుత్వ ఉన్నతాధికారుల్లో చర్చనీయాంశంగా మారింది.
స్పష్టమైన ప్రోటోకాల్ అవసరం
సెక్రిటేరియల్ (Telangana Secretariat) సెక్యూరిటీ విషయంలో రోజుకో రూల్ కాకుండా ఒకే విధమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) అమలు చేయాలని పలువురు కోరుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అనుసరించాల్సిన విధానం, సందర్శకుల ప్రవేశంపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని సూచిస్తున్నారు. భద్రత కఠినంగా ఉండటం అవసరమే. కానీ భద్రత పేరుతో నిబంధనలు తరచూ మారుస్తుండడం సరికాదంటున్నారు.
Also Read : కొండా పోస్ట్ ఊస్ట్ .. AICC కీలక నిర్ణయం..!
Follow Us On : WhatsApp

