కలం, వెబ్‌డెస్క్: పోలీసుల ఫోటోలను ఉపయోగించి అనుచిత పోస్టులు తయారు చేసిన ఇద్దరు వ్యక్తులను హర్యానా (Haryana) పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాలోని హిసార్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితులు ఓ మహిళా పారిశుద్ధ్య కార్మికురాలిని పోలీసు తన్నినట్లుగా ఏఐ సాయంతో హింసాత్మక చిత్రాన్ని సృష్టించారు. దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఏఐ ఫోటో (AI Photo) సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. ఏఐ చాట్‌బాట్ ఉపయోగించి ఈ ఫేక్ ఫోటోను క్రియేట్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీన్ని కొందరు నెటిజన్లు నిజమైన ఫోటోగా భావించి ప్రచారం చేస్తూ ఉండటంతో అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ సందర్బంగా పోలీసులు మాట్లాడుతూ.. అనధికార ఫోటోలు, వీడియోలు, ఏఐ క్రియేటెడ్ కంటెంట్‌ను ఎవరూ షేర్ చేయవద్దని హెచ్చరించారు. ఫేక్ కంటెంట్‌ను నిజమైనదని నమ్మిస్తూ షేర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, ఇతర డిజిటల్ సాక్ష్యాలను స్వాధీనం చేసుకొని తనిఖీ చేస్తున్నామని, ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తే చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

