కారులో కుమ్ములాట.. అశ్వారావుపేట బీఆర్ఎస్‌లో రోడ్డెక్కిన గ్రూప్ వార్!

కలం, అశ్వారావు పేట: భద్రాద్రి జిల్లా ​అశ్వారావుపేట నియోజకవర్గ బీఆర్ఎస్​లో (Ashwaraopet BRS) ఆధిపత్య పోరు పీక్ స్టేజ్​కు చేరింది. కాంగ్రెస్ ప్రభుత్వ విఫల పాలనపై నిరసన తెలపాలంటూ గులాబీ అధిష్టానం పిలుపునిస్తే, అశ్వారావుపేటలో అదికాస్త సొంత పార్టీ నేతల బలాబలాల ప్రదర్శనగా మారింది. కాంగ్రెస్‌పై పోరాటం పక్కనబెట్టి, గులాబీ నేతల మధ్య గ్రూప్ ఫైట్ నెలకొంది. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చూపుకునే వేదికగా వాడుకోవడంతో పార్టీలో విభేదాలు ఒక్కసారిగా రోడ్డునపడ్డాయి. ​అశ్వారావుపేట మండల కేంద్రంలో ఒకే రోజు, ఒకే అంశంపై జరిగిన నిరసన బీఆర్ఎస్‌లోని వర్గపోరుకు ఆజ్యం పోసింది.

మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు నేతృత్వంలోని వర్గం ఒకవైపు ర్యాలీ నిర్వహించగా, ఆయనకు వ్యతిరేక వర్గమైన తాటి వెంకటేశ్వర్లుతో పాటు ఇతర అసమ్మతి నేతలు ఏకమై పోటీగా ఆందోళనలు చేపట్టారు. ఒకే పార్టీకి చెందిన నేతలు వేర్వేరుగా జెండాలు పట్టుకుని రోడ్లపైకి వచ్చి బల ప్రదర్శనకు దిగడం స్థానికంగా విస్తృత చర్చకు దారితీసింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడం కంటే, తమ వెంట ఎంతమంది కార్యకర్తలు ఉన్నారో చూపించుకోవడానికే నేతలు పోటీపడ్డారు. ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేయకుండా తమ ఆధిపత్యానికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఇన్​చార్జ్‌పై విమర్శలు

​గులాబీ గ్రూపుల మధ్య ఆధిపత్య పోరుకు ఇటీవల తీవ్ర వివాదాస్పదంగా మారిన కోఆర్డినేటర్ పోస్టు నియామకమే ప్రధాన కారణమని తెలుస్తోంది. నియోజకవర్గంలో కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో సీనియర్లను, క్రియాశీల కార్యకర్తలను సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడంపై ద్వితీయ శ్రేణి నేతల్లో రగులుతున్న అసంతృప్తి ఇప్పుడు బయటపడింది. ద్వితీయ శ్రేణి నేతల అభిప్రాయాలను పక్కనబెట్టి వ్యవహరించడంతోనే గులాబీ పార్టీ రెండుగా చీలిపోయే పరిస్థితి వచ్చిందని పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ​పార్టీ పరిస్థితి దిగజారడానికి నియోజకవర్గ ఇన్​చార్జ్ ఉప్పల వెంకటరమణ వ్యవహారశైలే కారణమని కార్యకర్తలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

నియోజకవర్గంలో పార్టీని సమన్వయం చేయడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారని విమర్శిస్తున్నారు. అసమ్మతి రగులుతున్నాకానీ పట్టించుకోకుండా లైట్ తీసుకుంటున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కోఆర్డినేటర్ నియామకంపై రచ్చ జరుగుతున్న సమయంలో కానీ, రెండు వర్గాలు వేర్వేరుగా రోడ్లపైకి వచ్చి రభస సృష్టించిన కీలక సమయంలోనూ ఇన్​చార్జ్ అందుబాటులో లేకపోవడం శ్రేణులను తీవ్ర విస్మయానికి గురిచేసింది. ఇన్​చార్జ్ ఉన్నా లేనట్లే వ్యవహరిస్తుంటే.. నియోజకవర్గంలో పార్టీ పటిష్టత ఎలా సాధ్యమవుతుందని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.

గులాబీ కేడర్​లో ఆందోళన

  • కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఐక్యంగా పోరాడి పార్టీని బలోపేతం చేయాల్సిన సమయంలో నాయకత్వ లోపం కాస్త ‘ మెచ్చా వర్గం వర్సెస్ తాటి వర్గం’ మధ్య ముదిరిన ఆధిపత్య పోరు హాట్ టాపిక్‌గా మారింది.
  • ముఖ్య నేతల స్వార్థం, ఇన్ చార్జ్ ఉదాసీనత ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో పార్టీకి తీరని నష్టం వాటిల్లుతుందని బీఆర్ఎస్ కేడర్ తీవ్ర ఆందోళన చెందుతోంది.
  • అధిష్ఠానం తక్షణమే జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దకపోతే అశ్వారావుపేటలో గులాబీ పార్టీ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>