కలం, స్పోర్ట్స్: ఇంగ్లండ్ టూర్‌కు శ్రీలంక (Sri Lanka) జట్లను ప్రకటించింది. వన్డే, టీ20 రెండు ఫార్మాట్లకు కుశాల్ మెండిస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. చరిత్ అసలంక వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ టూర్ సెప్టెంబర్ 15న ప్రారంభం కానుంది. శ్రీలంక మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. సెప్టెంబర్ 5న జట్టు ఇంగ్లండ్‌కు బయలుదేరుతుంది. పాతుమ్ నిస్సంక, కమీందు మెండిస్, జనిత్ లియనాగే, వనిందు హసరంగ, దునిత్ వెల్లాలాగే రెండు జట్లలోనూ ఉన్నారు. మాజీ కెప్టెన్ దసున్ షనకకు వన్డే జట్టులో మళ్లీ చోటు దక్కింది. టీ20 జట్టులోనూ అతడు కొనసాగనున్నాడు. వన్డే జట్టులో పావన్ రత్నాయకే, సచిందు కొలంబగే, అసిత ఫెర్నాండో, దిల్షాన్ మధుశంక ఉన్నారు.
టీ20 జట్టులో లహిరు ఉదార, తరిందు రత్నాయకేలకు చోటు దక్కింది. నువాన్ తుషార, బినుర ఫెర్నాండో కూడా జట్టులో ఉన్నారు. టీ20 సిరీస్ సెప్టెంబర్ 15న సౌతాంప్టన్‌లో మొదలవుతుంది. రెండో మ్యాచ్ సెప్టెంబర్ 17న కార్డిఫ్‌లో, మూడో మ్యాచ్ సెప్టెంబర్ 19న మాంచెస్టర్‌లో జరుగుతుంది. ఆ తర్వాత వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. తొలి వన్డే సెప్టెంబర్ 22న డర్హామ్‌లో, రెండోది సెప్టెంబర్ 24న లీడ్స్‌లో, మూడోది సెప్టెంబర్ 27న లండన్‌లో జరగనుంది. ఇంగ్లండ్‌పై ద్వైపాక్షిక సిరీస్‌లో 12 ఏళ్లుగా విజయం దక్కని శ్రీలంకకు ఈ టూర్ కీలకంగా మారింది.

