కలం, యాదగిరిగుట్ట: విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకుని పట్టుదల, క్రమశిక్షణతో కృషి చేస్తే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని జిల్లా కలెక్టర్ (Bhuvanagiri Collector) అనురాగ్ జయంతి (Anuraag Jayanti) అన్నారు. భువనగిరి మండలం అనంతారం గ్రామంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన, భోజనం, పారిశుద్ధ్యం, మౌలిక వసతులను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి వారి విద్యాభ్యాసం, భవిష్యత్ లక్ష్యాలు, పరీక్షలకు సిద్ధమవుతున్న విధానం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులు తమలోని ప్రతిభను గుర్తించి క్రీడలు, ఐటీ, సాంకేతికత, కళలు తదితర రంగాల్లో రాణించేందుకు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. పదో తరగతి పరీక్షల విషయంలో అనవసరమైన ఒత్తిడికి గురికావద్దని అన్నారు. పదో తరగతి జీవితంలో ఒక ముఖ్యమైన అడుగు మాత్రమేనని, పరీక్షల్లో ఆశించిన ఫలితం రాకపోయినా జీవితం ఆగిపోదని విద్యార్థులకు సూచించారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
విద్యార్థుల ప్రగతిపై సంతృప్తి
పాఠశాల నిర్వహణ, విద్యాబోధన, విద్యార్థుల విద్యా ప్రగతిపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఉపాధ్యాయులు, సిబ్బంది చేస్తున్న కృషిని అభినందించారు. భవిష్యత్‌లో విద్యార్థులు వివిధ పోటీ పరీక్షలకు సమర్థవంతంగా సిద్ధమయ్యేందుకు అవసరమైన పుస్తకాలు, స్టడీ మెటీరియల్, ఇతర విద్యా సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి
పాఠశాల ఆవరణలోని బాత్రూమ్‌లు , తరగతి గదులు, ఇతర మౌలిక వసతులను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, సిబ్బందిపై ఉందన్నారు. పారిశుద్ధ్య విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని ప్రిన్సిపాల్‌కు సూచించారు. బాత్రూమ్‌ల తలుపులు, ఇతర వసతులు సక్రమంగా లేకపోతే వెంటనే మరమ్మతులు చేయించాలని ఆదేశించారు.
నాణ్యమైన భోజనం అందించాలి
పాఠశాల కిచెన్, స్టోర్ రూమ్‌ను కూడా కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు ప్రతిరోజూ నాణ్యమైన, పౌష్టికాహారంతో కూడిన భోజనం అందిస్తున్నారా లేదా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కిచెన్‌లో ఆహార పదార్థాల నిల్వ, పరిశుభ్రతను పరిశీలించారు. స్టోర్ రూమ్‌లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాల నాణ్యత, గడువు తేదీలను తనిఖీ చేశారు. విద్యార్థులకు గడువు ముగిసిన లేదా నాణ్యత లేని ఆహార పదార్థాలు అందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి మాధవి, పాఠశాల ప్రిన్సిపాల్ స్వప్న జెల్ల, ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

