కలం, నార్కట్‌పల్లి: నాయకుడు అంటే ఎలా ఉండాలి.. పేద ప్రజలకు ఏ విధంగా అండగా నిలవాలో నిరూపించిన మహానాయకుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి (YSR) అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Raj Gopal Reddy) కొనియాడారు. వైఎస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లెంల గ్రామంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలు దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతాయని అన్నారు. నల్గొండ జిల్లాను పీడిస్తున్న కరువు, ఫ్లోరైడ్ సమస్య నుంచి ప్రజలను రక్షించేందుకు వైఎస్సార్ ఉదయసముద్రం ప్రాజెక్టును ప్రారంభించారని గుర్తు చేశారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఉదయసముద్రం ప్రాజెక్టు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించామని తెలిపారు. వైఎస్సార్ చూపిన బాటలోనే తాము ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తామని, మాట ఇచ్చి మడమ తిప్పే నైజం తమది కాదని స్పష్టం చేశారు.
‘మా ఇంట్లోకి వచ్చి మమ్మల్నే వెళ్లగొడతామంటే చూస్తూ ఊరుకోం’
కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఇతర పార్టీల నాయకులను పార్టీలోకి ఆహ్వానించడం మంచిదేనని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. అయితే, “మా ఇంట్లోకి వచ్చి మమ్మల్నే వెళ్లగొడతామంటే చూస్తూ ఊరుకోం” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు ఏ చిన్న అన్యాయం జరిగినా వారి తరఫున తాను ముందుండి పోరాడతానని హామీ ఇచ్చారు. రాబోయేది వైఎస్సార్ ఆశయాల యుగమని, ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ నాయకత్వంలో మునుగోడు, నకిరేకల్ ప్రాంతాలను మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

