కలం, కరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని, మధ్యాహ్న భోజన వంట కార్మికులు, ఆశా కార్యకర్తల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ BRTU అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కరీంనగర్ (Karimnagar) కలెక్టరేట్ ఎదుట ధర్నా (Protest) నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. పాఠశాలల్లో గత 25 ఏళ్లుగా సేవలందిస్తున్న మధ్యాహ్న భోజన వంట కార్మికులకు మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా నెలకు రూ. 10 వేలు వేతనం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వంట బాధ్యతలను హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్‌కు అప్పగించే ఆలోచనను విరమించుకోవాలని, 94 జీవో ప్రకారం పాత కార్మికుల ఉద్యోగ భద్రతను కాపాడాలని కోరారు.
పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు, గుడ్డు రేటు పెంచాలని, ఐడీ కార్డులు మంజూరు చేయాలని స్పష్టం చేశారు. అలాగే గ్రామ స్థాయిలో నిరంతరం సేవలందిస్తున్న ఆశా కార్యకర్తలకు మేనిఫెస్టో ప్రకారం రూ. 18 వేలు ఫిక్స్‌డ్ వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఆశాలపై అదనపు భారంగా మారిన ANC టార్గెట్లు, BLO డ్యూటీలు, NCD, ABHA వంటి ఆన్‌లైన్ పనుల నుండి వెంటనే మినహాయింపు ఇవ్వాలని కోరారు.
ఖాళీగా ఉన్న ఆశా పోస్టులను వెంటనే భర్తీ చేసి, అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆశాలకు వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం స్పందించి ఈ సమస్యలను త్వరగా పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన వంట కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షురాలు బి. మంజుల, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి. నింబాయి, తెలంగాణ గ్రామీణ ఆరోగ్య కార్యకర్తల (ఆశా) సంఘం జిల్లా అధ్యక్షురాలు రథియా బేగం, ఇతర BRTU సంఘ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

