కలం, నిర్మల్: నిన్నటి వరకు తమ మధ్య నవ్వుతూ, మాట్లాడుకుంటూ ఆత్మీయంగా గడిపిన వారు.. నేడు విగతజీవులుగా మారడంతో నిర్మల్ (Nirmal)జిల్లా కుబీర్ మండలం పార్డీ (బి) (Pardi) గ్రామం కన్నీటి సంద్రమైంది. ఒకే రోడ్డు ప్రమాదం నాలుగు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. తమ ఆత్మీయులకు కడసారి వీడ్కోలు పలుకుతూ కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు అక్కడున్న ప్రతి ఒక్కరినీ కలచివేసింది. సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పార్డీ (బి) గ్రామానికి చెందిన జీపు డ్రైవర్ తులసీరాం, ఆవుల గంగాధర్, తూము సాయిలు, తూము గౌరబాయి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మృతులకు మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు గ్రామంలోని స్థానిక శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
ఒకేసారి నాలుగు చితిమంటలు
ఒకేసారి నలుగురి మృతదేహాలకు చితిమంటలు అంటుకోవడంతో శ్మశానవాటికలో విషాదం తారస్థాయికి చేరింది. చితిమంటలు ఎగసిపడుతుండగా కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. తమ వారిని చివరిసారిగా చూసుకుంటూ కన్నీటితో వీడ్కోలు పలికిన దృశ్యాలు చూపరులను సైతం కంటతడి పెట్టించాయి. గ్రామ చరిత్రలో ఒకే ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి కావడంతో పార్డీ (బి)లో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఈ ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతుల్లో ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి చెందిన సమీప బంధువులు కాగా, జీపు డ్రైవర్ తులసీరాం మరాఠా సామాజిక వర్గానికి చెందినవారు.

