కలం, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా తూప్రాన్ మండల పరిధిలో గత రాత్రి వరుస ఇళ్లల్లో చోరీలకు పాల్పడిన నిందితుడిని పోలీసులు (Toopran Police) 24 గంటల్లో అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను తూప్రాన్ సీఐ వెంకట్ రాజ గౌడ్ వెల్లడించారు. తూప్రాన్ పరిధిలోని పలు ఇళ్లల్లో గత రాత్రి గుర్తుతెలియని వ్యక్తి చొరబడి దొంగతనాలకు పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. అరెస్ట్ అయిన నిందితుడిపై గతంలోనూ పలు పోలీస్ స్టేషన్లలో అనేక చోరీ కేసులు నమోదైనట్లు సీఐ తెలిపారు. పాత నేరస్తుడైన ఇతను మళ్లీ వరుస దొంగతనాలకు పాల్పడినట్లు గుర్తించారు.
పోలీసుల చాకచక్యంతో నిందితుడిని ఘటన జరిగిన 24 గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి చోరీకి గురైన రెండు బైక్లు, రెండు గ్యాస్ సిలిండర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.

