కలం, కరీంనగర్ బ్యూరో: ఉచిత మెరుగైన వైద్యం అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (Karimnagar GGH)లో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా, పొరుగు జిల్లాల పేదలకు ఆపద్బాంధవుడిగా ఉన్న ఆస్పత్రి ప్రస్తుతం నిధుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఆరోగ్యశ్రీ బకాయిలు, విద్యుత్ బిల్లులు, మందులు, సర్జికల్ మెటీరియల్ సరఫరా సంస్థలకు చెల్లింపులు పెండింగ్‌లో ఉండటంతో వైద్య సేవలపై ప్రభావం పడుతోందని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.
రూ.12 కోట్ల బకాయిలు.. ఆర్థిక ఇబ్బందులు
GGH నిర్వహణకు సంబంధించిన నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో సుమారు రూ.12 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయినట్లు సమాచారం. ఇందులో ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.4 కోట్లు, విద్యుత్ బిల్లులు రూ.4 కోట్లు, మందులు, ల్యాబ్, సర్జికల్ ఏజెన్సీలకు మరో రూ.4 కోట్ల బకాయిలు ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొంటున్నాయి. బకాయిల కారణంగా సర్జికల్ మెటీరియల్, ఆపరేషన్ సామగ్రి, అత్యవసర మందుల సరఫరాపై ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెబుతున్నారు. హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ (HDS) సమావేశాలు సక్రమంగా నిర్వహించకపోవడం కూడా సమస్యలను మరింత తీవ్రతరం చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బకాయిలతో సరఫరా నిలిపివేత
జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్, ఈఎన్‌టీ, గైనకాలజీ విభాగాలకు అవసరమైన ఇంప్లాంట్లు, ప్లేట్లు, సర్జికల్ కిట్లను సరఫరా చేసే నాలుగు ప్రధాన ప్రైవేట్ ఏజెన్సీలకు మూడేళ్లుగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. సుమారు రూ.4 కోట్ల బకాయిల నేపథ్యంలో ఇకపై అప్పుగా సామగ్రి సరఫరా చేయలేమని ఆయా సంస్థలు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఖరీదైన శస్త్రచికిత్సలపై ప్రభావం పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఉచితంగా మోకీళ్ల మార్పిడి వంటి శస్త్రచికిత్సలు చేసిన ఆస్పత్రిలో ప్రస్తుతం అవసరమైన ఇంప్లాంట్లు అందుబాటులో లేక కొన్ని ఆపరేషన్లు వాయిదా పడుతున్నాయని సమాచారం.
పెరిగిన సీట్లు.. పెరగని బడ్జెట్?
కరీంనగర్ మెడికల్ కాలేజీలో MBBS సీట్లు 150 నుంచి 200కు పెరిగాయి. మరోవైపు ఆస్పత్రి రోజువారీ OPD సంఖ్య 1,500 దాటుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. పెరిగిన రోగుల సంఖ్య, వైద్య సేవలకు అనుగుణంగా బడ్జెట్‌ను పెంచాల్సి ఉన్నప్పటికీ.. నిధులు సకాలంలో అందకపోవడం సమస్యగా మారిందని ఆస్పత్రి వర్గాలు అంటున్నాయి. ఇక విద్యుత్ బిల్లులు సుమారు రూ.4 కోట్లు పెండింగ్‌లో ఉండటంతో విద్యుత్ శాఖ నుంచి నోటీసులు రావడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ICU, వెంటిలేటర్ వంటి అత్యవసర సేవలపై ప్రభావం పడకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు.
ఆరోగ్యశ్రీ బకాయిలతో శస్త్రచికిత్సలకు ఆటంకం
కరీంనగర్ GGHలో ప్రతి నెల వందలాది మంది పేద రోగులకు వివిధ రకాల శస్త్రచికిత్సలు నిర్వహిస్తుంటారు. ఆరోగ్యశ్రీ కింద నిర్వహించిన చికిత్సలకు సంబంధించిన ప్యాకేజీ నిధులు సకాలంలో విడుదల కావాల్సి ఉంటుంది. అయితే సుమారు రూ.4 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో ఆస్పత్రి నిర్వహణపై ఆర్థిక ఒత్తిడి పెరిగిందని వర్గాలు చెబుతున్నాయి.ఇంప్లాంట్లు, సర్జికల్ మెటీరియల్, అత్యవసర మందులు, ఇతర వైద్య పరికరాల సరఫరాలో సమస్యలు తలెత్తడంతో కొన్ని శస్త్రచికిత్సలు వాయిదా పడుతున్నాయని సమాచారం.
పేద రోగులపై అదనపు భారం
ప్రభుత్వాస్పత్రిలో ఉచిత వైద్యం అందుతుందని ఆశించి దూర ప్రాంతాల నుంచి వస్తున్న పేద రోగులకు మందుల కొరత అదనపు భారంగా మారుతోందని ఆరోపణలు ఉన్నాయి. వైద్యులు సూచించే మందుల్లో కొన్ని ఆస్పత్రిలో అందుబాటులో లేకపోవడంతో బయట ప్రైవేట్ మెడికల్ షాపుల్లో కొనుగోలు చేయాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. జగిత్యాల జిల్లా నుంచి కాలు విరిగి చికిత్స కోసం వచ్చిన ఓ రైతు.. వైద్యులు సూచించిన మందుల్లో కొన్ని మాత్రమే ఆస్పత్రిలో ఉచితంగా లభించాయని, మిగిలిన మందులు, ఆపరేషన్‌కు అవసరమైన సామగ్రిని బయట కొనుగోలు చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.
నిధులు రాగానే సేవలు పునరుద్ధరిస్తాం
ఈ అంశంపై ఆస్పత్రి అధికారులు స్పందిస్తూ.. ఆరోగ్యశ్రీ నిధులు విడుదలైన వెంటనే ఖరీదైన శస్త్రచికిత్సలు, ఇంప్లాంట్ల కొనుగోళ్లను పునఃప్రారంభిస్తామని తెలిపారు. గతంలో నిర్వహించిన మోకీళ్ల మార్పిడి వంటి శస్త్రచికిత్సలు ఆస్పత్రి సామర్థ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. బకాయిల చెల్లింపుల అనంతరం వైద్య సేవలను పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తామని వెల్లడించారు.
తక్షణ చర్యలు అవసరం
పేదలకు ఉచిత వైద్యం అందించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆరోగ్యశ్రీ నిధులను విడుదల చేయడంతో పాటు విద్యుత్ బిల్లులు, ఏజెన్సీల బకాయిలను చెల్లించాలని కోరుతున్నారు. పెరిగిన రోగుల సంఖ్య, మెడికల్ కాలేజీ సీట్లకు అనుగుణంగా ఆస్పత్రి బడ్జెట్‌ను పెంచాలని, HDS సమావేశాన్ని అత్యవసరంగా నిర్వహించి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు.

