కలం, జగిత్యాల: రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న ‘పచ్చ కాంగ్రెస్’ విధానాలు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ విధానాలకు అనుగుణంగా లేకపోవడంతోనే తాను కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లో చేరానని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి (Jeevan Reddy) స్పష్టం చేశారు. సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో జిల్లా పరిషత్ తొలి మాజీ చైర్పర్సన్ దావా వసంత సురేష్‌తో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
సంజయ్ కుమార్ ఆరోపణలపై జీవన్ రెడ్డి ఫైర్
తాను ఇందిరా గాంధీని విమర్శించానంటూ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేస్తున్న ఆరోపణలను జీవన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్లో చేరిన మూడు నెలల తర్వాత తాను ఓ ప్రైవేట్ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోను విలేకరులకు ప్రదర్శించి అసలు విషయాన్ని వివరించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు అహోరాత్రులు కష్టపడి, కేసీఆర్ ఆశీస్సులతో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన సంజయ్ కుమార్ ఆ తర్వాత ‘ఏరు దాటాక తెప్ప తగలేసినట్లు’ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేగా గెలిచిన ఆరు నెలలకే రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారని ఆరోపించారు. కేసీఆర్ ప్రత్యేక కోటా కింద మంజూరు చేసిన 4 వేల డబుల్ బెడ్రూం ఇళ్లతోనే నూకపల్లి కాలనీ ఏర్పడిందని జీవన్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ మంజూరు చేసిన కాలనీకి ఎవరి మెప్పు కోసం ఇందిరమ్మ పేరు పెట్టారో ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
‘నేనేం చేశానో కళ్లున్నా చూడలేకపోతున్నారు’
తన హయాంలో జగిత్యాలలో చేపట్టిన అభివృద్ధి పనులను గుర్తుచేసిన జీవన్ రెడ్డి.. కళ్లున్న ప్రతి ఒక్కరికీ అవి కనిపిస్తాయని అన్నారు. రాష్ట్రానికి మంజూరైన ఏకైక జేఎన్టీయూ కళాశాలను జగిత్యాలకు తీసుకొచ్చానని తెలిపారు. పోలసలో వ్యవసాయ కళాశాల, న్యాక్ శిక్షణ సంస్థను ఏర్పాటు చేశామని చెప్పారు. 25 ఎకరాల్లో మామిడి మార్కెట్‌ను ఏర్పాటు చేయడంతో పాటు 2009లోనే 4 వేల ఇళ్ల స్థలాల కోసం భూసేకరణ పూర్తి చేశామని వివరించారు. ఉపాధి హామీ కింద రూ.10 కోట్లు, ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద మరో రూ.10 కోట్లు మంజూరు చేయించానని తెలిపారు. హైదరాబాద్–రామగుండం రాజీవ్ రహదారి నిర్మాణం, జగిత్యాల–రాయికల్–బీర్పూర్ సీపీడబ్ల్యూ స్కీమ్ పునరుద్ధరణకు రూ.14 కోట్లు, జగన్నాథ్‌పూర్–బోర్నపల్లి మధ్య వంతెన నిర్మాణానికి రూ.18 కోట్లు తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.
రూ.100 కోట్ల మున్సిపల్ ఆస్తి దారాదత్తం: జీవన్ రెడ్డి
జగిత్యాల పట్టణంలోని కీలకమైన సర్వే నంబర్ 138లోని భూవివాదాన్ని జీవన్ రెడ్డి ప్రస్తావించారు. అక్కడ పెట్రోల్ బంక్ నిర్వహించేందుకు సంబంధిత సంస్థకు ఎలాంటి టైటిల్ లేదని కోర్టు స్పష్టం చేసినప్పటికీ, కలెక్టర్ టెండర్లు లేకుండా ఏకపక్షంగా ఐఓసీకి లీజ్ డీడ్ ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. నాలుగు గుంటల్లో ఉండాల్సిన పెట్రోల్ బంక్ పరిధిని దాటి అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపించారు. సుమారు రూ.100 కోట్ల విలువైన మున్సిపల్ ఆస్తిని కాపాడాల్సిన బాధ్యత ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు లేదా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులను సీఎం రేవంత్ రెడ్డి, జగిత్యాల జిల్లాలో కలెక్టర్ దారాదత్తం చేస్తున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు. మున్సిపాలిటీ, కలెక్టరేట్ అధికారులు నిద్రపోతున్నారని విమర్శించారు. ఈ భూవివాదంపై బీఆర్ఎస్ తరఫున ప్రజావాణిలో ఫిర్యాదు చేశామని, అవసరమైతే న్యాయపోరాటం కొనసాగిస్తామని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు ఆవారీ శివకేసరి, బాబు గాజుల రాజేందర్, రమేష్ రావు, దేవేందర్ నాయక్, తోట హరీష్, సింగరావు, వేణు, అభి, అనిల్, కాటిపల్లి రాజశేఖర్, గంగారెడ్డి, మాజీ కౌన్సిలర్లు కళ్లేపల్లి దుర్గయ్య, పుప్పాల అశోక్, నక్క జీవన్ తదితరులు పాల్గొన్నారు.

