కలం, నకిరేకల్ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా, రాష్ట్రం సంక్షేమ నిలయంగా రూపాంతరం చెందిందని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (MLA Vemula Veeresham) సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్‌ఎస్ విధ్వంసకర పాలనకు ముగింపు పలికి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా పాలన కొనసాగుతోందని పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో “తెలంగాణ రైజింగ్” నినాదంతో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని వీరేశం అన్నారు. గృహ అవసరాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందని స్పష్టం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించి కోట్లాది ప్రజల కల నెరవేర్చిన ఘనత సోనియా గాంధీకే దక్కుతుందని కొనియాడారు.
“వారి పదేళ్ల పాలన విధ్వంసకరమైతే.. మాది వికాసవంతమైన ప్రజా పాలన” అని ప్రభుత్వ విప్ అభివర్ణించారు. నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదికన ఏర్పడిన తెలంగాణలో గత ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నీరుగార్చిందని, ముఖ్యంగా నీటి కేటాయింపుల్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు స్పష్టమైన తీర్పు ఇచ్చినా బీఆర్‌ఎస్ నేతలకు మార్పు రాలేదని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్, కంటోన్మెంట్ ఫలితాలను బీఆర్‌ఎస్ గుర్తు తెచ్చుకోవాలని హితవు పలికారు.
దళితుడిని సీఎం చేస్తామని, మూడు ఎకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చి గత ప్రభుత్వం ఏ ఒక్కటీ నెరవేర్చలేదని.. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీలోనూ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. హాజీపూర్, అబ్దుల్లాపూర్‌మెట్ ఘటనలను ప్రస్తావిస్తూ ఆనాటి శాంతిభద్రతల లోపాలను ఎత్తి చూపారు. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదని.. కాబట్టి అసెంబ్లీ ప్రతిపక్ష నేత బాధ్యతలను ఏదైనా ఒక దళిత నాయకుడికి అప్పగించాలని వేముల వీరేశం సూచించారు.
ఇక ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ బాధ్యతాయుతమైన నాయకుడిగా మాట్లాడాలని, విమర్శలు చేసే ముందు గత బీఆర్ఎస్ పాలనా రీతులను గుర్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని, తెలంగాణను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలబెడతామని వీరేశం ధీమా వ్యక్తం చేశారు.

