కలం, నిర్మల్: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై నిర్మల్ మున్సిపల్ అధికారులు (Nirmal Municipality) కొరడా ఝుళిపించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం పట్టణంలోని పలు వ్యాపార దుకాణాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ప్లాస్టిక్ దుకాణాలు, స్వీట్ హోంలు, బేకరీలు, మిల్క్ సెంటర్లలో తనిఖీలు చేపట్టి నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన దుకాణదారులకు రూ.7,500 జరిమానా విధించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రవిబాబు మాట్లాడారు.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా మానుకోవాలని వ్యాపారులకు సూచించారు. ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయంగా క్లాత్ బ్యాగులను వినియోగించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలు, వ్యాపారులు మున్సిపల్ అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ తనిఖీల్లో శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్‌కుమార్, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ రజిని, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

