కలం, వెబ్ డెస్క్: జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లోని కథువా (Kathua) పట్టణంలో ఓ పావురం (Pigeon Incident) కలకలం రేపింది. పావురం కాలి రింగ్‌పై పాకిస్థాన్‌కు చెందిన ఫోన్ నెంబర్ ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో ఈ ఘటనపై తీవ్ర చర్చ మొదలైంది. అనంతరం ఆ పావురాన్ని పోలీసులకు అప్పగించారు. అయితే కథువా సరిహద్దు ప్రాంతానికి సమీపంలో ఉండటంతో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. సుదూర ప్రాంతాలకు సందేశాలు చేరవేసేందుకు ఈ పావురం ఉపయోగించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా గతంలో కూడా జమ్ములో ఎల్ఓసీ సమీపంలో ఇలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. రెండు రెక్కలపై రెండు నల్లటి గీతలతో ఉన్న పావురం కాళ్లకు గుర్తింపు రింగులు ఉన్నాయి. ఎడమ కాలికి ఉన్న ఎరుపు రంగు రింగ్ పై “Rehmat Sarkar (03158080213)” అని, కుడి కాలికి ఉన్న పసుపు రంగు రింగ్‌పై “Rizwan 2025 (017282)” అని రాసి ఉన్న పావురం పట్టుబడింది. అయితే ఆ పావురం రెక్కలపై “Nowshera Aling Pigeon Club” అనే ముద్ర కనిపించడంతో ఆ పావురం పాకిస్థాన్ లోని నౌషెరా ప్రాంతానికి చెందినదై ఉండొచ్చని భావించారు. స్థానికులు ఆ పావురాన్ని పల్లన్వాలా పోలీసులకు అప్పగించారు. అయితే ఆ పావురానికి ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్నట్లు అధికారులు నిర్ధారించలేదు.

