ఉద్యోగుల ఆగ్రహ జ్వాల.. రేవంత్‌ సర్కార్‌కు సెప్టెంబర్‌ టెన్షన్‌!

కలం, తెలంగాణ బ్యూరో : ఒకవైపు పార్టీలో అంతర్గత సంక్షోభం… మరోవైపు పాలనలో మంత్రుల మధ్య సమన్వయ లోపం.. వీటితో సతమతవుతున్న రాష్ట్ర సర్కార్కు ఇంకో వైపు ప్రభుత్వ ఉద్యోగులు (Telangana Employees), ఉపాధ్యాయుల నిరసన సెగ తాకుతున్నది. గత ప్రభుత్వం చేసిన అప్పులకు ‘అసలు’, వడ్డీ చెల్లించాల్సి వస్తున్నందున అనుకున్నంత స్థాయిలో ఎంప్లాయీస్ అవసరాలకు నిధులను విడుదల చేయలేకపోతున్నామంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆర్థిక శాఖను నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలు సందర్భాల్లో ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు వివరణ ఇచ్చారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే సర్దుబాటు చేస్తామంటూ అర్థం చేయించారు. పన్నుల వసూళ్లను పెంచాలని, బకాయిలను వసూలు చేయాలని, లీకేజీలను అరికట్టాలని, రాష్ట్ర ఆదాయ వనరులను పెంచితే వాటిని ఉద్యోగులకే ఇస్తామంటూ సీఎం మే నెల ఫస్ట్ వీక్‌లో హామీ ఇచ్చారు. ప్రతి నెలా రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ కోసం ప్రభుత్వం నిధులు ఇస్తున్నా సరిపోవడం లేదన్నది ఉద్యోగుల వాదన.

రెండున్నరేండ్లకే ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో ఆగ్రహం

గత ప్రభుత్వంలో సెకండ్ టర్మ్ చివర్లోనే ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో అసహనం, ఆగ్రహం పెరిగిపోయింది. ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటూ వారి నుంచి ఓపెన్‌గానే కామెంట్లు వినిపించాయి. కానీ, ఈసారి మాత్రం రెండున్నరేండ్లకే భగ్గుమన్నది. ఇంతకాలం ఓపిక పట్టిన ఉద్యోగులకు ఆశాజనకమైన పరిస్థితులు కనిపించడంలేదు. మే నెలలోనే ఒకసారి ప్రభుత్వానికి సమ్మె హెచ్చరిక చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం చర్చలతో అది మూడు నెలల పాటు రిలీఫ్ ఇచ్చినట్లయింది. చర్చల సందర్భంగా ఇచ్చిన హామీలు పకడ్బందీగా అమలు కాకపోవడంతో ఆగస్టులో వారి ఆగ్రహం తారస్థాయికి చేరుకున్నది. అప్పటివరకూ ఉన్న నాలుగు పెండింగ్ డీఏలు ఇప్పుడు అర డజనుకు పెరిగాయి. ఇక పీఆర్సీ ఊసే లేకుండా పోయిందనే అసంతృప్తికి లోనయ్యారు. హక్కులు, డిమాండ్ల సాధన కోసం ఆందోళనలు మినహా మరో మార్గం లేదని అత్యవసర సమావేశంలో తీర్మానం చేసి ఈ నెల 27న టోకెన్ పద్ధతిలో ఒక రోజు నిరసన నిర్వహించారు.

ఆరు ప్రధాన డిమాండ్లే లక్ష్యంగా..!

పీఆర్సీ ఫిట్‌మెంట్ ప్రకటన, పెండింగ్ డీఏల బకాయిల చెల్లింపు, సీపీసీని రద్దు చేసి ఓపీసీ పునరుద్ధరణ, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ సహా పెండింగ్ బిల్లులకు పేమెంట్స్, హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ పకడ్బందీ అమలు, జీవో 317 బాధితుల సమస్యలకు పరిష్కారం.. ఇలాంటి డిమాండ్లతో చీఫ్ సెక్రటరీకి తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్స్ జేఏసీ అధ్యక్ష కార్యదర్శులు మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు సహా కార్యవర్గ సభ్యులు మెమొరాండం అందజేశారు.

రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ అవసరాల కోసం వంద రోజుల్లో ఆరు వేల కోట్ల రూపాయలను ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఆ ప్రకారం విడుదల చేసినా పూర్తి న్యాయం జరగలేదని, వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద మొత్తాన్ని రిలీజ్ చేయాలని జేఏసీ ప్రతినిధులు డిమాండ్ చేశారు.

హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ప్రభుత్వం కార్డులు మంజూరు చేసినా రెండు నెలలుగా ఉద్యోగుల ‘బేసిక్ పే’ నుంచి 1.5% చొప్పున మినహాయించుకున్న కార్పొరేట్ వైద్యం అందడంలేదన్న సమస్యకు ప్రభుత్వం నుంచి పరిష్కారం కరువైంది.

ఆదాయం పెరిగినా..!

జీఎస్టీతో పాటు వాణిజ్య పన్నుల ఆదాయం గత కొన్ని నెలలుగా పెరుగుతూ ఉన్నదని, ఖజానా కూడా మెరుగుపడుతున్నదని ఉద్యోగులు భావిస్తున్నారు. రాష్ట్ర ఆదాయ వనరులను పెంచితే ఆ ఫలాలు తిరిగి ఉద్యోగులకే అందుతాయన్న సీఎం మాటలు కార్యరూపం దాల్చలేదన్నది వారి ఆవేదన. రెండున్నరేండ్లయినా పీఆర్సీ నివేదిక అతీగతీ లేకుండా పోయిందని, ప్రభుత్వ ఫిట్‌మెంట్ ప్రకటన ఊసే లేదని ఉద్యోగుల్లో నిరాశానిస్పృహలు నెలకొన్నాయి. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో నాలుగు పెండింగ్ డీఏలుంటే ఇప్పుడు మరిన్ని బకాయిలు పేరుకుని ఆరుకు చేరుకున్నాయన్నారు. ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ అయినందున ఉద్యోగులకు ఇవ్వాల్సిన నిధులను విడుదల చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఎలక్షన్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలునే డిమాండ్ చేస్తున్నామని జేఏసీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. సీపీఎస్ రద్దు పేరుతో ఇటీవలే ఉపాధ్యాయులు ఎల్బీ స్టేడియంలో నిరసన ప్రదర్శన నిర్వహించగా ఉద్యోగులంతా ఆరు ప్రధాన డిమాండ్లతో ధర్నా చౌక్‌లో ఒక రోజు నిరసన చేపట్టారు.

రాష్ట్రస్థాయి ఉద్యమంగా..!

  • ఆరు ప్రధాన డిమాండ్లతో పాటు విద్యాశాఖ రేషనలైజేషన్, ఏకీకృత సర్వీసు నిబంధనలు, అన్ని శాఖల్లో ఖాళీ పోస్టుల భర్తీ కోసం జీవో 190 అమలును విద్యాశాఖ, హోంశాఖ మొదలు అన్ని విభాగాలకు వర్తింపజేయడం, భాగ్యనగర్ టీఎన్జీవో హౌజింగ్ సొసైటీ స్థలం సమస్య పరిష్కారం, జీ-రామ్-జీ ఉద్యోగులకు ‘పే స్కేల్’ అమలు, ఫైనాన్స్-హెల్త్-ఎడ్యుకేషన్ విభాగాల్లోని ఉన్నతాధికారుల అలసత్వంపై చర్యలు, డిగ్రీ కాలేజీ లెక్చరర్లకు యూజీసీ సెవెన్త్ పే స్కేల్ బకాయిల విడుదల.. ఇలాంటి పలు డిమాండ్లను చర్చల సందర్భంగా ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల నేతలు విన్నవించారు.
  • ప్రధాన కార్యదర్శిగా ఆగస్టు 17 మెమొరాండం ఇచ్చి సత్వరం పరిష్కరించాలని, లేనిపక్షంలో షెడ్యూల్ ప్రకారం ఆందోళనల బాట పడతామని స్పష్టం చేశారు.
  • పది రోజుల గడువులో సానుకూల స్పందన రాకపోవడంతో ఆగస్టు 27న ధర్నా చౌక్‌లో భారీ ధర్నా నిర్వహించారు.
  • అయినా, ఫలితం లేకపోవడంతో యథావిధిగా సెప్టెంబర్ 1న ‘పెన్షన్ విద్రోహ దినం’, సెప్టెంబర్ 10న ‘చలో హైదరాబాద్’ పేరుతో మహా ధర్నాకు సిద్ధమవుతున్నారు.
  • అప్పటికీ ఫలితం లేకపోతే తదుపరి కార్యాచరణపై ఉగ్యోగ సంఘాల జేఏసీ మరోమారు సమావేశమై నిర్ణయం తీసుకోనున్నది.

డిమాండ్లు.. నిరసనలు

  • పీఆర్సీ ఫిట్‌మెంట్ ప్రకటన, పెండింగ్ డీఏల చెల్లింపు, సీపీసీ రద్దు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సహా పెండింగ్ బిల్లులకు పేమెంట్స్, పకడ్బందీగా హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అమలు, జీవో 317 బాధితులకు న్యాయం.. ఈ ప్రధాన డిమాండ్లతో ఆగస్టు 17న సీఎస్కు ఉద్యోగ సంఘాల జేఏసీ మొమోరాండం.
  • పది రోజుల గడువులో సానుకూల స్పందన రాకపోవడంతో షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 27న ధర్నా చౌక్‌లో భారీ ధర్నా చేపట్టిన ఉద్యోగులు. అయినా, ఫలితం లేకపోవడంతో సెప్టెంబర్ 1న ‘పెన్షన్ విద్రోహ దినం’, సెప్టెంబర్ 10న ‘చలో హైదరాబాద్’ పేరుతో మహా ధర్నాకు సిద్ధం.
  • అప్పటికీ ఫలితం లేకపోతే తదుపరి కార్యాచరణపై మరోసారి సమావేశం కానున్న ఉగ్యోగ సంఘాల జేఏసీ. జీఎస్టీతో పాటు వాణిజ్య పన్నుల ఆదాయం గత కొన్ని నెలలుగా పెరుగుతున్నా.. ఆ ఫలాలు తిరిగి ఉద్యోగులకే అందుతాయన్న సీఎం మాటలు కార్యరూపం దాల్చలేదన్నది ఉద్యోగుల ఆవేదన.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>