కలం, తెలంగాణ బ్యూరో: ‘సర్’ ప్రక్రియను వేగవంతం చేయాలనుకున్న ఎలక్షన్ కమిషన్‌కు ఊహించని దెబ్బ తగిలింది. తమకు చెల్లించే రెమ్యూనరేషన్ (గౌరవ వేతనం) అందలేదని, పలుమార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదనే ఆరోపణలతో బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్‌వోలు) విధులకు దూరంగా ఉన్నారు. దీంతో హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఓటర్లకు నోటీసులు పంపిణీ చేసే ప్రక్రియకు బ్రేక్ పడింది. కొన్ని నియోజకవర్గాల్లో వారం రోజులుగా సమ్మె జరుగుతుండగా, మరికొన్ని చోట్ల ఇప్పుడిప్పుడే మొదలవుతున్నది. కూకట్‌పల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాల్లోని బీఎల్‌వోలు వారం రోజులుగా సమ్మె చేస్తుండడంతో ఓటర్లకు నోటీసులు సకాలంలో అందడం లేదు. కొన్ని నియోజకవర్గాల్లో బీఎల్‌వోలకు గౌరవ వేతనాలు అందకపోయినా విధుల్లో కొనసాగుతున్నారు. ‘సర్’ ప్రక్రియ సమయంలోనే కాకుండా రెగ్యులర్‌గా కొత్త ఓటర్లు చేరే పనుల్లోనూ బీఎల్‌వోలు పాల్గొంటూ ఉంటారు. ఈ అవసరాల కోసం ఎలక్షన్ కమిషన్‌కు ప్రత్యేకమైన సిబ్బంది లేకపోవడంతో ప్రభుత్వంలో వివిధ విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగులనే నియమించుకుని గౌరవ వేతనం ఇస్తూ ఉంటుంది.
నోటీసులు అందక విచారణకు రాని ఓటర్లు
హైదరాబాద్ నగరంలో దాదాపు 4,000 మంది బీఎల్‌వోలు ఉన్నారు. వీరిలో కొన్ని నియోజకవర్గాల్లోని బీఎల్‌వోలు సమ్మెలో పాల్గొనడంతో ఓటర్లకు సకాలంలో నోటీసులు అందలేదు. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) కార్యాలయం నుంచి డిస్పాచ్ అయిన నోటీసులు అందకపోవడంతో వారికి ఇచ్చిన టైమ్ షెడ్యూల్ గడువు ముగిసిపోయింది. లెక్క ప్రకారం వారికి కేటాయించిన సమయానికి విచారణకు తగిన ఆధారాలతో హాజరు కావాల్సి ఉన్నది. ఓటర్ల జాబితాలో ఉన్న పేర్లకు, ఎన్యూమరేషన్ ఫారాల్లో ఉన్న వివరాలకు మధ్య తేడాలు ఉండడంతో తగిన ఆధారాలను సమర్పించేందుకు ఆ ఓటర్లకు సీఈవో ఆఫీస్ నోటీసులు జారీ చేసింది. కానీ బీఎల్‌వోలు విధులకు దూరంగా ఉన్నందున ఓటర్లకు నోటీసులు అందలేదు. దీంతో వారి విచారణ గడువు ముగిసిపోయింది. వీరికి తిరిగి నోటీసులు జారీ అవుతాయా? వారి వివరాలకు తగిన ఆధారాలకు మరోసారి గడువు ఉంటుందా? సీఈవో ఆఫీస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అర్హత ఉన్న ఓటర్ల పేర్లు తిరిగి జాబితాలో చేరుతాయా?.. ఇలాంటి సందేహాలకు సీఈవో ఆఫీస్ వివరణ ఇవ్వాల్సి ఉంది.
అందరికీ అందని నోటీసులు
‘సర్’ ప్రక్రియలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ (హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలు) పరిధిలో వివరాల్లో తేడాలు (అనామలీస్) ఉన్నట్లు గుర్తించిన సుమారు 19 లక్షల మందికి నోటీసులు అందజేయాల్సి ఉంది. నోటీసుల్లో విచారణకు ఎప్పుడు రావాలో తేదీ, సమయం కూడా సీఈవో ఆఫీస్ పేర్కొంటుంది. కానీ విచారణకు హాజరుకావాల్సిన ఓటర్లందరికీ నోటీసులు అందలేదు. దీంతో ఆగస్టు 26 నుంచి 28 తేదీల మధ్య విచారణకు హాజరుకావాల్సిన ఓటర్లకు నోటీసులు అందకుండానే గడువు ముగిసిపోయింది. తెలంగాణ సీఈవో సుదర్శన్‌రెడ్డి ఆగస్టు 28న అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, విచారణకు హాజరుకావాల్సిన ఓటర్లందరికీ నోటీసులు తప్పనిసరిగా అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. విచారణకు హాజరుకావాల్సిన ఓటర్లకు సమాచారం అందించడం బీఎల్‌వోల బాధ్యత అని స్పష్టం చేశారు. కానీ కొందరు బీఎల్‌వోలు విధులకు దూరంగా ఉండడంతో నోటీసులు అందించే బాధ్యత ఎవరిదనేది ప్రశ్నార్థకంగా మారింది.
వన్ ఇన్‌స్టాల్‌మెంట్ చెల్లింపు
సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు చెందిన బీఎల్‌వో జి.పల్లవి మాట్లాడుతూ.. ‘‘గౌరవ వేతనాలు అందకపోవడంతో గత ఐదు రోజులుగా సమ్మెలో ఉన్నాం. ఇప్పటివరకు ఒక విడతకు సంబంధించిన రెమ్యూనరేషన్ రూ.5,500 మాత్రమే అందింది. మిగిలిన మొత్తాన్ని త్వరలో చెల్లిస్తామంటూ అధికారులు గతంలోనే చెప్పారు. కానీ ఇంకా చెల్లించలేదు” అని తెలిపారు. బోయిన్‌పల్లి ప్రాంతానికి చెందిన మరో బీఎల్‌వో ఫర్జానా బేగం కూడా గౌరవ వేతనాల చెల్లింపుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆగస్టు 3న గౌరవ వేతనం చెల్లిస్తామని అధికారులు చెప్పారని, దాదాపు నెల రోజులు గడిచినా ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదన్నారు. బోయిన్‌పల్లి డివిజన్‌కు చెందిన బీఎల్‌వో సాదియా బేగం మాట్లాడుతూ.. తమ డివిజన్‌లోని బీఎల్‌వోలు చెల్లింపులు అందకపోయినా పని చేస్తున్నారని తెలిపారు. ఆగస్టు 28 నుంచి 31 మధ్య విచారణకు హాజరుకావాల్సిన ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో విధులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
వెంటనే చెల్లించాలి: ఎమ్మెల్యే శ్రీగణేశ్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్.. బీఎల్‌వోలతో సమావేశాలు నిర్వహించి ‘సర్’ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. బీఎల్‌వోల గౌరవ వేతనాలను విడుదల చేయాలని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లను (ఈఆర్‌వోలు) కోరారు. విచారణ సమయంలో ఓటర్లు సమర్పించాల్సిన పత్రాలకు సంబంధించిన వివరాలను విస్తృతంగా ప్రచారం చేయాలని ఎన్నికల అధికారులను ఆదేశించారు. అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లతో (ఏఈఆర్‌వోలు) సంప్రదించి విచారణకు సంబంధించిన షెడ్యూల్‌ను సిద్ధం చేయాలని సూచించారు.

