కొండా ఇక ఇంటికేనా.. త్వరలో హస్తీనకు కాంగ్రెస్ కీలక నేతలు!

కలం, తెలంగాణ బ్యూరో: మంత్రి కొండా సురేఖ (Konda Surekha), ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డిపై చర్యలు తీసుకునే ప్రక్రియ క్లైమాక్స్‌కు చేరుకున్నది. ఈ వ్యవహారం తెలంగాణ నుంచి ఢిల్లీకి షిఫ్ట్ అయింది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ విదేశీ పర్యటనను ముగించుకుని మంగళవారం ఢిల్లీకి చేరుకోనున్నారు. వీరిద్దరిపై తెలంగాణ పీసీసీ క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించి, రాష్ట్ర నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఏఐసీసీ (AICC) తుది నిర్ణయం తీసుకోనున్నది. వాళ్లిద్దరిపై చర్యలు తీసుకోవాల్సిందేనని క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇవ్వడంతో, రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలను బేరీజు వేసుకుని ఏఐసీసీ డెసిషన్ తీసుకోనున్నది. సెప్టెంబర్ 3న ఏఐసీసీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్, పీసీసీ నేతలతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి ఈ అంశంపై చర్చించనున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న రెండు బెర్తులతో పాటు మొత్తం కేబినెట్‌నే పునర్వ్యవస్థీకరించడంపైనా చర్చలు జరగనున్నాయి. వచ్చే నెల 7న రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగనున్నందున, ఆ తర్వాత కేబినెట్ మార్పుచేర్పులపై ఫోకస్ పెట్టే అవకాశమున్నది.

సెట్ రైట్‌పై ఫోకస్

ముఖ్యమంత్రికి పలువురు మంత్రులు సహకరించడం లేదని, పార్టీలోని కొందరు నేతలు కూడా ఇష్టారీతిన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని భావిస్తున్న అధిష్టానం.. ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. భేదాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు, అసంతృప్తి ఉంటే అంతర్గత ఫోరమ్‌లో మాట్లాడాలని సీఎం, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, పీసీసీ చీఫ్ పలుమార్లు చెప్పినా కొందరు నేతలు బహిరంగంగా విమర్శలు చేస్తూ వివాదాలకు కేంద్రంగా మారడంతో.. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందేననే బలమైన వాదనలు పార్టీలో వినిపిస్తున్నాయి. అంతర్గత కలహాలకు చెక్ పెట్టడంతో పాటు రాబోయే రెండున్నరేండ్ల పాలనను సెట్ రైట్ చేయడం హైకమాండ్‌కు కీలకంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లేముందు పార్టీలో, ప్రభుత్వంలో లుకలుకలు మంచిది కాదని.. రెండు వ్యవస్థల మధ్య పటిష్ట సమన్వయం, పార్టీలో ఐక్యతారాగం చాలా కీలకమని, విపక్షాలకు ఈ విభేదాలు రాజకీయ అస్త్రంగా మారొద్దన్నది సీనియర్ నేతల అభిప్రాయం. కొండా సురేఖ, చిన్నారెడ్డిపై తీసుకునే యాక్షన్ భవిష్యత్తులో వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారికి గుణపాఠంగా ఉండాలన్న పీసీసీ అభిప్రాయం మేరకు ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది కీలకం.

బీసీ సెంటిమెంట్‌ను ఎదుర్కొనేలా వ్యూహం

  • మంత్రివర్గం నుంచి కొండా సురేఖకు ఉద్వాసన పలికితే, ఒక బీసీ మహిళను తొలగించారని విపక్షాలు విమర్శలు గుప్పించే అవకాశం ఉందని కాంగ్రెస్ హైకమాండ్ గుర్తించింది. ఈ నేపథ్యంలో గతంలో బీసీ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ విషయంలో ఏం జరిగిందనే అంశాన్ని ప్రస్తావించి దీటుగా ఎదుర్కొనే అవకాశం ఉన్నది.
  • కొండా సురేఖను తొలగించాలంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బహిరంగంగా డిమాండ్ చేయడం, క్రమశిక్షణా కమిటీ సైతం అదే అభిప్రాయంతో ఉన్న నేపథ్యంలో ఆ కామెంట్లకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం, వీలైతే మరో బీసీ మహిళను మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా సెంటిమెంట్ అస్త్రాన్ని ఎదుర్కోవచ్చన్న వాదనా వినిపిస్తున్నది.
  • ఎలాగూ నవంబర్‌‌లో గవర్నర్ కోటాలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నందున కేబినెట్‌లోకి నాన్-మెంబర్‌ను తీసుకొచ్చే అంశం కూడా పార్టీ, ప్రభుత్వ పరిశీలనలో ఉన్నది.
  • కొద్దిమంది మంత్రులు అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తుండడంతో వారి స్థానంలో కొత్తవారికి అవకాశాలు ఇచ్చేలా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంశం కూడా ఏఐసీసీ పరిశీలనలో ఉన్నది.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>