కలం, యాదగిరిగుట్ట/ బీబీనగర్ : యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం చిన్నరావుల పల్లి (Chinnaravula Pally) గ్రామంలో కొలువుదీరిన పోచమ్మ తల్లి దేవాలయంలో బోనాల పండుగను భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం సాయంత్రం పోచమ్మ తల్లి ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.
చిన్న రావులపల్లి గ్రామానికి చెందిన మహిళలు కొత్త మట్టి కుండలలో పసుపు , పాలు, పెరుగు, అన్నంతో తయారుచేసిన బోనాన్ని తలపై ఎత్తుకుని, వేపాకులు, పసుపు, కుంకుమతో అలంకరించి డప్పు వాయిద్యాల నడుమ గ్రామంలో గల పోచమ్మ తల్లి దేవాలయానికి తరలివచ్చారు. బోనం ఎత్తుకున్న మహిళల పాదాలకు నీళ్లు పోసి గ్రామస్తులు స్వాగతం పలికారు. పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లతో గ్రామమంతా మారుమోగింది.
గ్రామంలోని పోచమ్మ ఆలయంలో బోనాల సందర్భంగా అంగరంగ వైభవోపేతంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవార్లను దర్శించుకున్నారు. పంటలు బాగా పండాలని, గ్రామంలో ఎలాంటి అంటురోగాలు రాకుండా కాపాడాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీకాంత్ యాదవ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు, కైరంకొండ కరుణ పాండు, యువకులు గ్రామస్తులు తదితరులుఅధిక సంఖ్యలో ఉన్నారు.

