రియల్ హీరో రాజేంద్ర.. 1,643 మందిని కాపాడి!

కలం, వెబ్ డెస్క్: వరదలతో కకావికలమైన నేపాల్‌లో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఘటనలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. ఒక స్కూల్ ప్రిన్సిపల్ సమయస్ఫూర్తి కారణంగా ఏకంగా 1,643 మంది చిన్నారులు ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన పేరే రాజేంద్ర దాదాబి (Rajendra Dadabi). నువాకోటి జిల్లాలోని త్రిభువన్ త్రిశూలి సెకండరీ స్కూల్ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. గత బుధవారం ఉదయం 9.20 గంటలకు ఊహించని వరద స్కూల్ వైపు వస్తున్నట్లు పొరుగు గ్రామం బెట్రావతి నుంచి స్నేహితుడు కాల్ చేసి చెప్పాడు. తమ గ్రామం మొత్తం కొట్టుకుపోయిందన్నాడు. ఈ వార్త విన్న రాజేంద్ర భయభ్రాంతులకు గురయ్యాడు. అప్పటికే పాఠశాలలో 900 మంది చిన్నారులు ఉండగా.. మరో 700 మంది స్కూల్ బస్సుల ద్వారా వస్తున్నారు.

అందరికీ ఫోన్లు చేసి..

రాజేంద్ర ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. స్కూల్ బెల్ మోగించి పిల్లలను ఎత్తయిన ప్రాంతానికి వెళ్లేలా వేగంగా చర్యలు చేపట్టారు. అలా వెళ్లిన కొద్ది నిమిషాల్లోనే పాఠశాలను మొత్తం వరద కమ్మేసి నామరూపాల్లేకుండా చేసేసింది. అదే సమయంలో, పాఠశాలకు వస్తున్న స్కూల్ బస్సులు గుర్తొచ్చాయి. ఒక్కో బస్సులో కనీసం 80 మంది విద్యార్థులు ఉన్నారు. వెంటనే డ్రైవర్లకు ఫోన్లు చేసి, ఎక్కడివారు అక్కడి నుంచే వెనక్కి వెళ్లిపోవాలని సూచించాడు.

ఇంతలో ఒక బస్సు పాఠశాల సమీపంలోకి వస్తున్నట్లు గుర్తించారు. వంతెన వద్దకు చేరుకోగానే.. వెంటనే వెనక్కి తిప్పాలని సైగలు చేశాడు. డ్రైవర్ కూడా స్పందించి స్టీరింగ్ తిప్పేశాడు. కొన్ని నిమిషాల్లోనే బస్సు ఉన్న వంతెన కుప్పకూలిపోయింది. అలా మొత్తం 1,643 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. రాజేంద్ర సమయస్ఫూర్తి ప్రపంచానికి తెలియడంతో రియల్ హీరో.. అంటూ నెటిజన్లు పొగుడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>