కలం, స్పోర్ట్స్ : టెన్నిస్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. 20 సార్లు గ్రాండ్‌స్లామ్ ఛాంపియన్‌గా నిలిచిన స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ (Roger Federer) ‘ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్’లో అధికారికంగా చోటు దక్కించుకున్నారు. యూఎస్ఏలోని రోడ్ ఐలాండ్, న్యూపోర్ట్‌లో జరిగిన ఈ వేడుకలో ఫెడరర్ భావోద్వేగానికి లోనయ్యారు.
ఈ అరుదైన గౌరవ సభలో ఫెడరర్ సతీమణి మిర్కా ముందుగా ప్రసంగించి ఆయనను వేదికపైకి ఆహ్వానించారు. భార్య మాట్లాడిన తీరును మెచ్చుకుంటూ నవ్వుతూ ప్రసంగాన్ని ప్రారంభించిన ఫెడరర్, ఆమె తర్వాత మాట్లాడటం తనకు ఎంతో కష్టంగా ఉందని సరదాగా వ్యాఖ్యానించారు. మొదట కాస్త ఒత్తిడికి గురయ్యానని కూడా చెప్పారు.
అయితే ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. తన చిన్ననాటి రోల్ మోడల్ స్టెఫాన్ ఎడ్బర్గ్ గురించి చెబుతున్నప్పుడు ఫెడరర్ కళ్ల వెంట నీళ్లు తిరిగాయి. ఆ సమయంలో ఇవి ఆనంద బాష్పాలని ఆయన సభలోని వారికి స్పష్టం చేశారు.
కెరీర్లో 103 ఏటీపీ టైటిళ్లు సాధించి, 310 వారాల పాటు ప్రపంచ నంబర్ వన్‌గా నిలిచిన తన సుదీర్ఘ ప్రయాణంలో సతీమణి మిర్కా అందించిన సహకారాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన మళ్లీ భావోద్వేగానికి లోనయ్యారు. తన భావోద్వేగాన్ని దాచుకోవడానికి టిష్యూలు, సన్‌గ్లాసెస్ కావాలని నవ్వుతూ సర్దుకున్నారు.
తన టెన్నిస్ ప్రయాణంలో తొలి రోజులను గుర్తుచేసుకున్న ఫెడరర్, బాసెల్‌లో బాల్ బాయ్‌గా చేసిన రోజులను గుర్తుచేసుకుంటూ బాల్ బాయ్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తాన్ కూడా ఒకప్పుడు వారిలాగే ఉన్నానని చెప్పారు.
8 వింబుల్డన్, వరుసగా 5 యూఎస్ ఓపెన్ టైటిళ్లు గెలిచినా, పేరు ప్రఖ్యాతులు సాధించడం తన ప్రధాన లక్ష్యం కాదని, తనకు నచ్చిన ఆటను ఇష్టమైన వ్యక్తులతో కలిసి ఆడటమే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. ఆట నుంచి నిష్క్రమించినప్పటికీ, టెన్నిస్‌తో తన బంధం శాశ్వతంగా కొనసాగుతుందని ఫెడరర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

