జగిత్యాల అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరు: ఎమ్మెల్యే సంజయ్

కలం, కరీంనగర్ బ్యూరో: ఎన్ని విమర్శలు చేసినా జగిత్యాల నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఆగవని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ (MLA Sanjay) స్పష్టం చేశారు. ఆదివారం జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీరుపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జీవన్ రెడ్డి మాట్లాడే మాటలు ద్వేషపూరితంగా ఉన్నాయే తప్ప విమర్శలలా లేవని మండిపడ్డారు.

 ప్రైవేట్ లిమిటెడ్ అంటారా?

గత పదేళ్లుగా కేసీఆర్‌ను తీవ్రంగా విమర్శించి, ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేసిన జీవన్ రెడ్డి, కార్యకర్తలను కాదని కేసీఆర్‌ను చాటుగా కలిసి ప్యాకేజీ మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజల సంక్షేమం కోసం రేవంత్ రెడ్డి, తాను కలిసి పనిచేస్తుంటే “ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ” అనడం విడ్డూరంగా ఉందన్నారు. వయసు పెరిగిన కొద్దీ జీవన్ రెడ్డి ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇందిరమ్మ కాలనీ అభివృద్ధి నా హయాంలోనే..

2008లో శంకుస్థాపన చేసిన ఇందిరమ్మ కాలనీని నాటి నాయకులు ఏనాడూ పట్టించుకోలేదని, 17 ఏళ్ల తర్వాత తాను ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఇండ్లు నిర్మించానని డాక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వంతో కలిసి పనిచేయడం వల్లనే అర్బన్ హౌసింగ్ కాలనీకి రూ. 34 కోట్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు కేసీఆర్ 1,500 డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు మంజూరు చేస్తే, తాను జగిత్యాలలో ఏకంగా 4,500 ఇండ్ల నిర్మాణం చేపట్టిన విషయాన్ని ప్రజలు గుర్తుంచుకున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 8 నెలలుగా ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి ఇక్కడి కాలనీవాసులకు ఉగాదికి బూరెలు తినిపిస్తానని చెప్పి ఏం చేశారో సమాధానం చెప్పాలన్నారు.

వైద్యం, విద్యకు ప్రాధాన్యం..

జగిత్యాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని, తెలంగాణలోనే మెడికల్ కాలేజీ, ఆస్పత్రి, నర్సింగ్ కాలేజీ ఒకే చోట ఉన్న ఏకైక జిల్లా జగిత్యాల అని ఎమ్మెల్యే తెలిపారు. రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ప్రస్తుతం నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పురోగతిలో ఉందని వివరించారు.

విమర్శలు మాని నిజాలు మాట్లాడాలి..

కొత్త బస్టాండ్ పెట్రోల్ బంక్ వివాదంపై స్పందిస్తూ, జీవన్ రెడ్డి అనుచరులు మున్సిపాలిటీలో ఉన్నప్పుడే దానికి అనుమతులు ఇచ్చారని గుర్తుచేశారు. గతంలో సీనియర్ నాయకుల హయాంలో అభివృద్ధి కంటే అణచివేతకే ప్రాధాన్యం ఇచ్చారని, మాజీ జెడ్పీ చైర్మన్‌పై విజిలెన్స్ కేసులు పెట్టించి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిని భూకబ్జాదారుడిగా చిత్రించారని ఆరోపించారు. జగిత్యాల ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే రోజువారీ అభివృద్ధి పనులకు భూమిపూజలు చేస్తున్నామని, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా జగిత్యాల ప్రగతిని ఆపలేరని డాక్టర్ సంజయ్ కుమార్ పునరుద్ఘాటించారు.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>