కలం, నాగర్ కర్నూల్: ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 100 రోజులలోనే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించిందని, అధికారంలోకి వచ్చి సుమారు 1000 రోజులు అవుతున్న సమస్యలు పరిష్కరించకపోవడం తగదని బీఆర్ఎస్ యువనేత నాగం శశిధర్ రెడ్డి (Nagam Shashidhar Reddy) విమర్శించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు చేపట్టే పోరాటాలకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని అన్నారు. ఆదివారం నాగర్‌కర్నూల్ (Nagar Kurnool) జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శశిధర్ రెడ్డి మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ డిక్లరేషన్ల పేరుతో అనేక హామీలను ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఏ ఒక్క గ్యారెంటీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని విరుచుకుపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేస్తున్న పథకాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు, విద్యార్థులకు, యువకులకు, రైతులకు, నిరుద్యోగులకు డిక్లరేషన్లలో ఆ పార్టీ అధినేతల సమక్షంలో అనేక హామీలను ప్రకటించడం జరిగిందని, 35 అంశాలపై బహిరంగ సభలు ఏర్పాటు చేసి ప్రజలను మోసం చేశారని విమర్శించారు.
ప్రభుత్వ పథకం ప్రైవేటు ఉద్యోగులకు 11వ హామీగా పెండింగ్‌లో ఉన్న మూడు డిజైన్లను తక్షణమే చెల్లిస్తామని, రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు 1వ తేదీన వేతనాలు అందే విధంగా చర్యలు తీసుకుంటామని, సప్లమెంటరీ బిల్లులు 15 పని దినాలలో చెల్లిస్తామని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేస్తామని హమీ ఇచ్చారని, అనేక అలవికాని మాటలతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు.
ప్రభుత్వ ఉద్యోగుల పోరాటాలకు సంపూర్ణ మద్దతు ప్రకటించి ప్రత్యక్షంగా పాల్గొంటామని హెచ్చరించారు. రైతులకు రుణమాఫీ చేస్తామని హామీలు ఇచ్చారని తెలిపారు. నిరుద్యోగులు కౌలు రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇటీవల సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రాజెక్టు పై చర్చించినట్లు ప్రకటనలు ఇచ్చారని, వాటి ఎజెండాను, తీసుకున్న నిర్ణయాలను బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రాజెక్టుల ద్వారా నీటిని విడుదల చేయాలని లేదంటే రైతులతో కలిసి ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఏదుల రిజర్వాయర్ నుండి పాలమూరు రంగారెడ్డి పథకానికి గండికొడుతూ తిండి ప్రాజెక్టుకు నీటిని మళ్ళిస్తే సహించేది లేదని, రైతులకు నష్టం జరిగే విధంగా చర్యలు తీసుకుంటే పనులను అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు అర్థం రవి, బాలా గౌడ్, కౌన్సిలర్ అర్జునయ్య, భీముడు, సత్యం, అహ్మద్, వెంకటస్వామి, దామోదర్, విష్ణు చారి, మూలింటి వెంకటేశ్వర్లు, ప్రవీణ్ చారి, సుభాష్, తదితరులు పాల్గొన్నారు.

