కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. ఆదివారం చింతకాని, బోనకల్ మండలాల్లో రూ.131.61 కోట్ల అంచనా వ్యయంతో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ నిధులతో చింతకాని మండలం లచగూడెంలో రూ.29 కోట్లతో నూతన ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, రూ.14 కోట్లతో వివిధ బీటీ రోడ్లు, పలు ఎస్సీ కాలనీల్లో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు.
బోనకల్ మండలంలో కలకోట–లక్ష్మీపురం (రూ.57 కోట్లు), బ్రహ్మణపల్లి–రాపల్లి (రూ.26 కోట్లు) ప్రధాన రహదారుల వెడల్పు పనులతో పాటు నారాయణపురం, మోటమర్రిలలో పీఏసీఎస్ గోదాములు, సీసీ రోడ్లు, రాపల్లి పంచాయతీ భవనాన్ని నిర్మించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, విద్య, వ్యవసాయ రంగాలను మెరుగుపరచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గ ప్రసాద్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

