కలం, వెబ్ డెస్క్ : వైసీపీలో వైఎస్ జగన్ కేవలం నామమాత్రపు అధినేతగా మిగిలిపోయారని, పార్టీలో అసలైన నెంబర్ వన్ సజ్జల రామకృష్ణారెడ్డేనంటూ (Sajjala) మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. దీంతో తాజాగా విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు.ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ అంశంపై సజ్జల మీడియా సమావేశంలో మాట్లాడారు.
పాత్రలు మాత్రమే మారుతున్నాయి..
సుదీర్ఘకాలం పార్టీకి నాయకత్వం వహించే సత్తా ఉన్న నేత జగన్ అని, ఐదేళ్లలోనే పేదల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకొచ్చారని సజ్జల తెలిపారు. అయితే ప్రస్తుతం వైసీపీపై రాజకీయ దాడి కొనసాగుతూనే ఉందని ఆరోపించారు. వైసీపీని విమర్శించే అంశంలో పాత్రలు మాత్రమే మారుతున్నాయని విజయసాయిరెడ్డిను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు ఈ రకమైన విమర్శలు అన్న ఆయన.. పబ్లిసిటీ కోసం చంద్రబాబు చేసే ప్రయత్నాలను జగన్ కు ఆపాదిస్తున్నారని మండిపడ్డారు.
అందుకే విజయసాయి ఆరోపణలు
విజయసాయిరెడ్డి సొంత కారణాలతో వైసీపీ నుంచి బయటకు వెళ్లారని సజ్జల అన్నారు. పార్టీ వీడిన వారి గురించి జగన్ ఎప్పుడూ నెగిటివ్ గా మాట్లాడలేదని.. 2024 ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలినా పార్టీ వేగంగా పుంజుకుంటోందని తెలిపారు. జగన్ మతమార్పిడిలను ప్రోత్సాహించారని విజయసాయి ఆరోపించడం దారుణం అని వ్యాఖ్యానించారు. నిజంగా జగన్ అలా చేసి ఉంటే విజయసాయినే మార్చేవాళ్లు కదా? అని ప్రశ్నించారు. అటెన్షన్ కోసమే విజయసాయి ఆరోపణలు చేస్తున్నారని … వైసీపీ అంటే కోటరీ అనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారని చెప్పారు.
వైసీపీకి అన్ని జగనే
వైసీపీలో జగన్ నెం.2.. సజ్జల నెం.1 అని విజయసాయి అనడం సరికాదని అన్నారు. వైసీపీకి కర్త, కర్మ, క్రియ ఎప్పుడూ జగన్ అని తేల్చారు. విజయసాయికి జగన్ నెం.2 స్థానం కల్పించారని.. ఈ అంశాన్ని తాము ఎప్పుడూ పట్టించుకోలేదని స్పష్టం చేశారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను ఇకపై పట్టించుకోనని .. పార్టీ నేతలు కూడా ఆయన ఆరోపణలను పట్టించుకోవద్దని సజ్జల వైసీపీ నేతలకు తెలిపారు.

